Staying Up Until Midnight: అర్ధరాత్రి దాకా మేల్కొంటున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
తెలుసుకోండి..

Staying Up Until Midnight: స్మార్ట్‌ఫోన్లలో రీల్స్ చూడటం, లేట్ నైట్ సిరీస్‌లు, ఆఫీస్ వర్క్.. కారణం ఏదైనా నేటి తరం నిద్రకు కేటాయించే సమయం దారుణంగా పడిపోయింది. "ఏం కాదులే, రేపు కాస్త ఎక్కువ పడుకుంటే సరిపోతుంది" అని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ, వైద్య నిపుణులు మాత్రం ఈ అలవాటు తీవ్ర ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. రోజూ తగినంత నిద్ర పోకపోతే మెదడు లోపల జరిగే నష్టం ఊహకందని విధంగా ఉంటుందని వైద్య శాస్త్రం స్పష్టం చేస్తోంది. నిద్ర అనేది కేవలం శరీర అలసటను తీర్చే సమయం మాత్రమే కాదు. మనం పడుకున్నప్పుడే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించుకుంటుంది, జ్ఞాపకశక్తిని పదిలం చేస్తుంది, మరుసటి రోజు అవసరమైన శక్తిని రీఛార్జ్ చేసుకుంటుంది. అలాంటి కీలక సమయాన్ని లాగేసుకుంటే మెదడు ఏ విధంగా దెబ్బతింటుందో నిపుణులు వెల్లడించిన కీలక అంశాలు..
ఆలోచనల్లో స్పష్టత గల్లంతు.. ఏకాగ్రత సున్నా
నిద్రలేమి వల్ల మెదడులో మొదట కనిపించే ప్రభావం ఫోకస్ కోల్పోవడం. ఒక పని చేస్తున్నప్పుడు త్వరగా దృష్టి మరలిపోతుంది. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టలేకపోవడం, తక్షణ స్పందన మందగించడం జరుగుతుంది. రోజువారీ పనులు ముగించినట్లు అనిపించినా, తెలియకుండానే ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి.
విపరీతమైన చిరాకు, మూడ్ స్వింగ్స్
వరుసగా కొన్ని రోజులు సరిగ్గా నిద్రపోకపోతే భావోద్వేగాల నియంత్రణ దెబ్బతింటుంది. చిన్న విషయానికే విపరీతమైన కోపం, అసహనం, ఏ పనీ చేయాలనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది దీన్ని "వర్క్ స్ట్రెస్" లేదా "మూడ్ ఆఫ్" అనుకుంటారు; కానీ అసలు కారణం మెదడుకు కావాల్సిన రీఛార్జ్ దక్కకపోవడమే.
సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం
సమస్యలు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో స్పందించే శక్తిని మెదడు కోల్పోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సరైన విశ్లేషణ చేయలేక తడబడతారు. సమస్య పరిష్కార సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది.
ఎంత సమయం నిద్రపోవాలి?
మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయడానికి పెద్దలకు రోజుకు కనీసం 7 గంటలకు పైగా నిద్ర తప్పనిసరి. కేవలం గంటల సంఖ్య మాత్రమే కాకుండా, రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన గాఢ నిద్ర పొందడం అత్యంత ముఖ్యం.

