Struggling With Constipation: మలబద్ధకం వేధిస్తోందా? మందులు లేకుండా ఉపశమనం పొందే మార్గాలివే
ఉపశమనం పొందే మార్గాలివే

Struggling With Constipation: ఉదయం లేవగానే సాఫీగా మలవిసర్జన జరగకపోవడం, టాయిలెట్‌లో ఎక్కువ సమయం కూర్చోవాల్సి రావడం, తీవ్రంగా ముక్కడం.. నేటి కాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సాధారణ సమస్యల్లో మలబద్ధకం ప్రధానమైనది. దీనివల్ల రోజంతా కడుపు ఉబ్బరంగా, భారంగా, చిరాకుగా అనిపిస్తుంది. చాలామంది ఈ సమస్య నుంచి బయటపడటానికి తాత్కాలికంగా మెడికల్ షాపుల్లో దొరికే మాత్రలు, సిరప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే మందులు వాడినప్పుడు మాత్రమే ఉపశమనం కలిగి, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంటుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోకుండా మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం దొరకదని జీర్ణాశయ వ్యాధుల నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సమస్యకు అసలు కారణాలేంటి?
నిపుణుల పరిశీలన ప్రకారం మలబద్ధకానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉంటున్నాయి..
రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లోపించడం
శరీరానికి అవసరమైనంత మోతాదులో నీరు తాగకపోవడం
శారీరక శ్రమ, నడక లేకపోవడం
సమయానికి తినకపోవడం, అసమతుల్య దినచర్య
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే రోజూ ఇలా చేయండి
ఉదయం నీరు తాగడం: నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల పెద్దపేగులు ఉత్తేజితమై వ్యర్థాలను బయటకు నెట్టే ప్రక్రియ సులువవుతుంది.
అల్పాహారం తర్వాత విసర్జన: తిన్న వెంటనే మన శరీరంలో పేగుల కదలికలు పెరుగుతాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టాయిలెట్‌కు వెళ్లే అలవాటు చేసుకోవడం మంచిది.
బలవంతంగా ముక్కవద్దు: మలవిసర్జన సమయంలో తీవ్రంగా ముక్కడం వల్ల పైల్స్, ఫిషర్స్ వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీర సహజ ఒత్తిడి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లాలి.
ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి
మలబద్ధకం నుంచి శాశ్వత ఉపశమనం పొందాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి:
పండ్లు: బొప్పాయి, జామకాయ, యాపిల్ వంటి పండ్లు మలాన్ని మృదువుగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కూరగాయలు – పప్పులు: పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు, వివిధ రకాల పప్పు దినుసులు తీసుకోవాలి.
తృణధాన్యాలు: మైదాతో చేసిన పదార్థాలను పూర్తిగా పక్కనపెట్టి ఓట్స్, ముడి గోధుమలు, మిల్లెట్స్ (చిరుధాన్యాలు) డైట్‌లో చేర్చుకోవాలి.
వీటితో పాటు రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం, నిత్యం 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల పేగుల కదలికలు మెరుగవుతాయి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
జీవనశైలి మార్పులు చేసినా సమస్య తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు.
మలంలో రక్తం పడటం
తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు రావడం
కడుపు తీవ్రంగా ఉబ్బరించి గ్యాస్ కూడా బయటకు పోకపోవడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది పేగులకు సంబంధించిన ఇతర తీవ్ర రుగ్మతలకు సంకేతం కావచ్చని, వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

