Struggling with High Uric Acid: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేటి రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో యూరిక్ యాసిడ్ ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం సహజ ప్రక్రియే అయినప్పటికీ, అది పరిమితికి మించి పెరిగిపోతే కీళ్ల నొప్పులు, కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రమవుతాయి. చాలామంది నాన్-వెజ్ ఎక్కువగా తినడం వల్లే యూరిక్ యాసిడ్ పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి మనం ఉదయం పూట చేసే కొన్ని చిన్నపాటి తప్పులు కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులను ప్రమాదకరంగా పెంచుతాయి.

ఉదయాన్నే చేసే ఈ 5 తప్పులను వెంటనే మార్చుకోండి:

లేవగానే పంచదార కలిపిన టీ తాగడం

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా పంచదారతో కూడిన టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, అధిక చక్కెర, తీపి పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పరగడుపున తీపి టీ తాగే అలవాటును వెంటనే మానుకోవాలి.

ఉదయాన్నే నీళ్లు తాగకపోవడం

రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఉదయం శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. యూరిక్ యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు పంపే ప్రధాన బాధ్యత కిడ్నీలదే. ఉదయం లేవగానే సరిపడా నీరు తాగకపోతే కిడ్నీల పనితీరు మందగించి, రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. కాబట్టి నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం.

ఉదయం హై-ప్యూరిన్ ఆహారాలు తీసుకోవడం

ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణమైనప్పుడు యూరిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఉదయం తీసుకునే అల్పాహారంలో ప్యూరిన్ స్థాయి ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజు ప్రారంభాన్ని తేలికగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో చేయాలి.

వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం

ఉదయం వేళ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా బద్ధకంగా గడపడం యూరిక్ యాసిడ్ పెరుగుదలకు దారితీస్తుంది. ఉదయం పూట కనీసం 20-30 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి.

అల్పాహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం

సమయం సరిపోక చాలామంది ఉదయం ప్యాక్ చేసిన స్నాక్స్, బేకరీ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. వీటిలో ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా శరీరంలో టాక్సిన్స్, యూరిక్ యాసిడ్ స్థాయులను పెంచుతాయి.

యూరిక్ యాసిడ్ పెరిగితే కనిపించే ప్రధాన లక్షణాలు.

కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, ఎర్రబారడం.

ముఖ్యంగా కాలి బొటనవేలు, మడమల్లో సూదులతో గుచ్చినట్లు విపరీతమైన నొప్పి రావడం.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల నడుము కింది భాగంలో తీవ్ర నొప్పి రావడం.

Next Story