Suffering from Acidity and Gas After a Heavy Biryani Meal: కడుపునిండా బిర్యానీ తిన్నాక ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? వంటగదిలోనే ఉంది తక్షణ పరిష్కారం!
తక్షణ పరిష్కారం!

Suffering from Acidity and Gas After a Heavy Biryani Meal: పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. ఘుమఘుమలాడే బిర్యానీలు, నూనెలో వేయించిన పదార్థాలు, రకరకాల స్వీట్లను లాగించేస్తుంటాం. అయితే తిన్నంత సేపూ బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. అతిగా తినడం, తిన్న వెంటనే ఆలస్యంగా పడుకోవడం వల్ల చాలామందిలో కడుపు ఉబ్బరం, అజీర్ణం, గుండెల్లో తీవ్రమైన మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అసౌకర్యం నుంచి బయటపడటానికి వెంటనే మందుల షాపులకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోని వంటగదిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియను వేగవంతం చేసే సహజ నివారణలు.
అల్లం కషాయం: అల్లంలో ఉండే జింజెరోల్ అనే ఔషధ గుణాలు కడుపులోని అసౌకర్యాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని అల్లం ముక్కలను నీటిలో వేసి సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి. భోజనం చేసిన తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా తాగితే జీర్ణక్రియ వేగవంతమై, గుండెల్లో మంట నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మజ్జిగ లేదా పెరుగు:
జీర్ణ సమస్యలకు మన ఇళ్లలో తరతరాలుగా వాడుతున్న ఉత్తమ ఔషధం మజ్జిగ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ కడుపులోని ఆమ్లతను సమతుల్యం చేస్తాయి. పెరుగు లేదా పల్చటి మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగితే జీర్ణ ఎంజైమ్లు ఉత్తేజితమై కడుపు తేలికపడుతుంది.
భోజనం తర్వాత సోంపు:
హోటళ్లలో లేదా విందుల్లో తిన్న తర్వాత సోంపు ఇవ్వడం వెనుక పెద్ద ఆరోగ్య రహస్యమే ఉంది. సోంపులో ఉండే 'అనెథోల్' అనే రసాయన సమ్మేళనం కడుపులోని కండరాలను సడలించి గ్యాస్, ఎసిడిటీని నివారిస్తుంది. తిన్న వెంటనే కొద్దిగా సోంపు నమలడం లేదా సోంపును వేడి నీటిలో ఐదు నిమిషాలు మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కడుపుబ్బరం త్వరగా తగ్గుతుంది.
అరటిపండు:
బాగా పండిన అరటిపండు ఎసిడిటీకి సహజ విరుగుడుగా పనిచేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం కడుపులోని యాసిడ్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపు లోపలి పొరకు రక్షణ కవచంలా ఏర్పడి ఆమ్లాల ప్రభావం వల్ల మంట కలగకుండా కాపాడుతుంది.
కొబ్బరి నీళ్లు:
కడుపులోని వేడిని తగ్గించి జీర్ణవ్యవస్థను చల్లబరచడానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు శరీర pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతాయి. నూనె పదార్థాలు, బిర్యానీలు ఎక్కువగా తిన్న సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు తేలికపడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఈ చిన్న జాగ్రత్త మరువకండి..
కడుపునిండా తిన్న వెంటనే నిద్రపోవడం లేదా సోఫాలో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎసిడిటీ మరింత తీవ్రమవుతుంది. భోజనం ముగించిన తర్వాత కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమై, గ్యాస్ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

