Suffering from Painful Mouth Ulcers: నోటి పూతతో నరకం చూస్తున్నారా? కారణాలు ఇవే.. నొప్పి తగ్గించుకోవడానికి 5 సహజ చిట్కాలు..
సహజ చిట్కాలు..

Suffering from Painful Mouth Ulcers: నోటి పూత అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్యే అయినా.. అది వచ్చినప్పుడు పడే బాధ అంతా ఇంతా కాదు. కనీసం మంచి నీళ్లు తాగాలన్నా, ముద్ద దిగాలన్నా లేదా నాలుగు మాటలు మాట్లాడాలన్నా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఈ పుండ్లు కొన్ని రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే శరీరంలో పోషకాల లోపం, నోటి లోపలి భాగం కొరుక్కోవడం వల్ల కలిగే గాయాలు, మితిమీరిన మానసిక ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఇవి తరచూ వస్తుంటాయి. ఈ నొప్పి, మంట నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం.
నోటి పూత నొప్పిని తగ్గించే సహజ మార్గాలు
గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు నోటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆ నీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మింగకూడదు. ఇది నోటి లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించి, వాపు మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
తేనె వాడకంలో జాగ్రత్తలు
కొందరు నోటి పూత ఉన్న చోట కొద్దిగా తేనెను పూతలా రాస్తుంటారు. ఇది ఉపశమనం అందించినప్పటికీ, అందరిలోనూ పుండ్లను త్వరగా నయం చేస్తుందనడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ తేనె రాసినప్పుడు మంట లేదా అసౌకర్యం మరింత పెరిగితే వెంటనే దాన్ని కడిగేసి, వాడకాన్ని ఆపేయాలి.
ఆలోవెరా ఉపయోగించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త!
కలబందకు శోథ నిరోధక గుణాలు ఉన్న మాట వాస్తవమే. అయితే చర్మానికి వాడే సాధారణ ఆలోవెరా జెల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నోటి లోపల రాయకూడదు. కేవలం నోటి పూత కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఓరల్ సేఫ్ కలబంద ఉత్పత్తులను మాత్రమే నిపుణుల సలహాతో ఎంచుకోవాలి.
ఆహారపు అలవాట్లలో మార్పులు
నోటి పూత ఉన్న సమయంలో ఎక్కువ కారం, పులుపు, మితిమీరిన ఉప్పు, నూనెలో వేయించిన కరకరలాడే ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవి పుండ్లపై తగిలితే నొప్పి మరింత తీవ్రమవుతుంది. చల్లటి లేదా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండే మెత్తటి ద్రవాహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే రోజుకు తగినంత మంచి నీరు తాగాలి.
మృదువైన బ్రష్, నోటి పరిశుభ్రత
దంతాలు తోముకునేటప్పుడు గట్టి బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌ను వాడితే పుండ్లు మరింత పెద్దవయ్యే ప్రమాదం ఉంది. అందుకే అల్ట్రా-సాఫ్ట్ టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. నోటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
మాటిమాటికీ నోటి పూత వస్తుంటే నిర్లక్ష్యం వద్దు.
కొందరిలో ఈ సమస్య తరచూ తిరగబెడుతుంటుంది. శరీరంలో ఐరన్, విటమిన్ B12 లేదా ఫోలేట్ లోపం వల్ల కూడా నోటి పుండ్లు పదేపదే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారు కేవలం ఇంటి చిట్కాలకే పరిమితం కాకుండా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
నోటి పూత రెండు వారాలు (14 రోజులు) దాటినా తగ్గకపోతే,
పుండు పరిమాణం క్రమంగా పెరుగుతున్నా,
నీరు తాగడానికి లేదా ఆహారం మింగడానికి కూడా వీల్లేనంత తీవ్రమైన నొప్పి ఉంటే,
పుండ్లతో పాటు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దంత వైద్యులను లేదా జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

