అయినా ఈ లక్షణాలు ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

Sugar Report Shows Normal: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో డయాబెటిస్ ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. అయితే చాలామందికి షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్ అన్నీ సాధారణంగానే వస్తుంటాయి. కానీ ఒంట్లో నీరసం, విపరీతమైన అలసట మాత్రం తగ్గవు. ఇలాంటి పరిస్థితిని సాధారణ సమస్యగా కొట్టిపారేయకండి. ఎందుకంటే, అది మీ శరీరంలో దాగి ఉన్న హిడెన్ డయాబెటిస్ కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ దాగి ఉన్న మధుమేహం?

రక్త పరీక్షలో చక్కెర స్థాయిలు సాధారణంగా కనిపించినప్పటికీ, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే.. మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, కణాలు గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తాత్కాలికంగా సాధారణంగా ఉన్నట్లు అనిపించినా, కణాలకు అందాల్సిన గ్లూకోజ్ అందక శరీరం తీవ్రమైన అలసటకు గురవుతుంది.

షుగర్ నార్మల్‌గా ఉన్నా.. ఈ లక్షణాలను విస్మరించకండి..

మీ రిపోర్ట్స్ పక్కన పెట్టి, మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయేమో గమనించండి:

నిరంతర అలసట:

ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని నీరసం

తిన్న తర్వాత నిద్ర:

భోజనం చేసిన వెంటనే విపరీతమైన నిద్ర ముంచుకురావడం.

బొజ్జ పెరగడం:*

పొట్ట చుట్టూ అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడం.

తీపి కోరికలు:

తరచుగా స్వీట్లు లేదా పిండి పదార్థాలు తినాలనిపించడం..

చర్మ మార్పులు: మెడ వెనుక లేదా చంకల భాగంలో నల్లటి మచ్చలు ఏర్పడటం.

దృష్టి సమస్యలు: అప్పుడప్పుడు కళ్లు మసకబారడం.

పరీక్షలలో ఎందుకు దొరకదు?

సాధారణంగా మనం చేయించుకునే ఫాస్టింగ్ లేదా పోస్ట్ లంచ్ షుగర్ టెస్టులు కేవలం ఆ సమయానికి రక్తంలో ఉన్న చక్కెరను మాత్రమే చూపిస్తాయి. కానీ ఇన్సులిన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఇవి చెప్పలేవు. అందుకే, నిరంతర అలసట వేధిస్తుంటే HbA1c లేదా HOMA-IR వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష!

దాచిన డయాబెటిస్ నుండి బయటపడాలంటే కేవలం మందులు మాత్రమే సరిపోవు. జీవనశైలిలో మార్పులు తప్పనిసరి..

1. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక.

2. ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించి, ప్రోటీన్, పీచు పదార్థాలు పెంచడం.

3. తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం.

మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. రిపోర్ట్స్ కంటే మీ ఆరోగ్యం పట్ల మీకున్న అవగాహనే మిమ్మల్ని రక్షిస్తుంది..

PolitEnt Media

PolitEnt Media

Next Story