Summer Can Worsen Migraines: రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో సామాన్యులే కాకుండా ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారు నరకం చూస్తున్నారు. ఎండ తీవ్రత నరాలపై ప్రభావం చూపి, తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మరి ఈ వేసవి గండం నుండి మైగ్రేన్ బాధితులు ఎలా బయటపడాలి? నిపుణులు చెబుతున్న చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి

ఎండ వల్ల శరీరం చెమట రూపంలో నీటిని, లవణాలను కోల్పోతుంది. దీనివల్ల మెదడుకు వెళ్లే రక్త ప్రసరణలో మార్పులు వచ్చి మైగ్రేన్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. దాహం వేసే వరకు ఆగకుండా.. గంట గంటకూ నీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి.

ఆ సమయాల్లో బయటకు వెళ్లొద్దు

మధ్యాహ్నం పూట వచ్చే తీవ్రమైన సూర్యరశ్మి, వెలుతురు మైగ్రేన్ పేషెంట్లకు ప్రధాన శత్రువులు. ఇవి నేరుగా నరాలను ఉత్తేజపరిచి నొప్పిని కలిగిస్తాయి.ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. గొడుగు, టోపీ లేదా సన్ గ్లాసెస్ (నల్ల అద్దాలు) తప్పనిసరిగా ధరించండి.

తిండి విషయంలో నిర్లక్ష్యం వద్దు

వేసవిలో ఆకలి తక్కువగా ఉండటం సహజం. అయితే భోజనం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి, అది మైగ్రేన్‌కు దారితీస్తుంది. ఒకేసారి భారీ భోజనం చేయకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి. కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలకు ఈ సీజన్‌లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

నిద్రతోనే ఉపశమనం

వేడి వల్ల రాత్రిపూట నిద్ర పట్టకపోవడం సహజం. కానీ నిద్రలేమి మైగ్రేన్‌ను రెట్టింపు చేస్తుంది. మీరు నిద్రపోయే గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి.

Next Story