Taking Magnesium Supplements Like Candy: సాధారణంగా చాక్లెట్లు, జెల్లీలు అంటే పిల్లలే ఇష్టపడతారు. కానీ నేడు విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లను రంగురంగుల గమ్మీలు, మిఠాయిల రూపంలో మార్కెట్లోకి తెస్తుండటంతో పెద్దలు కూడా వీటిని ఆసక్తిగా తింటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి, రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవడానికి, కండరాల నొప్పులను దూరం చేసుకోవడానికి మెగ్నీషియం సప్లిమెంట్లను మిఠాయిల్లా తీసుకోవడం ఒక కొత్త ఫ్యాషన్‌గా మారింది. అయితే, వైద్యుల సలహా లేకుండా ఇలా ఇష్టారాజ్యంగా సప్లిమెంట్లను లాగించేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక మెగ్నీషియం వల్ల కలిగే ప్రధాన నష్టాలు

వైద్య నిపుణుల సమాచారం ప్రకారం, శరీరం సాధారణంగా పనిచేయడానికి మెగ్నీషియం అవసరమే అయినప్పటికీ, దాన్ని మితిమీరి తీసుకోవడం ప్రమాదకరం.

జీర్ణవ్యవస్థపై ప్రభావం:

మెగ్నీషియం ఎక్కువగా తీసుకుంటే మొదట ప్రభావం చూపేది కడుపుపైనే. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

హైపర్‌మెగ్నీషిమియా ముప్పు:

శరీరంలో నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ మెగ్నీషియం చేరితే ఆ పరిస్థితిని వైద్యపరంగా హైపర్‌మెగ్నీషిమియా అంటారు. సాధారణంగా రోజుకు 350 మిల్లీగ్రాములకు మించి సప్లిమెంట్ల రూపంలో మెగ్నీషియం తీసుకోకూడదు. అంతకు మించితే అది విషతుల్యంగా మారుతుంది.

రక్తపోటు, శ్వాస సమస్యలు:

అదనపు మెగ్నీషియం రక్తనాళాలను విపరీతంగా సడలించేలా చేస్తుంది. దీంతో రక్తపోటు వేగంగా పడిపోతుంది. అలాగే ఊపిరితిత్తుల కండరాలపై, గుండె నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

మూత్రపిండాలపై ఒత్తిడి:

శరీరంలో అదనంగా చేరిన ఖనిజాలను వడకట్టి బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలదే. రోజూ పరిమితికి మించి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మరింత హానికరం.

దంతాల క్షీణత, ఊబకాయం:

గమ్మీలు, టోఫీ రూపంలో ఉండే సప్లిమెంట్లకు రుచి కోసం కృత్రిమ చక్కెరలు, సిరప్‌లను కలుపుతారు. వీటిని ఎక్కువగా నమలడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. శరీరంలోకి అధిక కేలరీలు చేరి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

సహజసిద్ధమైన మార్గాలే మేలు

సోషల్ మీడియా రీల్స్ చూసి లేదా ట్రెండ్‌ను అనుసరించి సొంతంగా సప్లిమెంట్లను వాడటం సరికాదు. నిద్రలేమి లేదా అలసట వంటి సమస్యలు ఉన్నప్పుడు నేరుగా మందుల దుకాణానికి వెళ్లి క్యాప్సూల్స్, గమ్మీలు కొనే బదులు ఆహారంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం.. పాలకూర వంటి, ఆకుకూరలు, బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం

ఏదైనా సప్లిమెంట్ వాడాలని భావిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించి, అవసరమైన రక్త పరీక్షలు చేయించుకున్న తర్వాతే సూచించిన మోతాదులో వాడాలి. శరీరానికి మేలు చేస్తుందనుకుని చేసే అతి, చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకునేలా మారకూడదు.

Next Story