Taking Vitamin D Supplements: విటమిన్ డి సప్లిమెంట్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలియకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ..
అయితే ఈ విషయాలు తెలియకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ..

Taking Vitamin D Supplements: నేటి యాంత్రిక జీవనంలో ఎండ తగలకపోవడం, గంటల తరబడి ఏసీ గదుల్లోనే గడపడం వల్ల మెజారిటీ ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి కీలకమైన ఈ విటమిన్ కోసం చాలా మంది సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటిని ఎలా పడితే అలా వాడితే ఆశించిన ఫలితం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలు లేదా నీరు.. దేనితో తీసుకోవడం ఉత్తమం?
విటమిన్ డి సప్లిమెంట్లను దేనితో తీసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు: పాలల్లో కొవ్వు, కాల్షియం ఉంటాయి. విటమిన్ డి అనేది ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్ కాబట్టి పాలతో తీసుకుంటే శరీరం దీనిని వేగంగా గ్రహిస్తుంది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు లేదా పాలు ఇష్టపడని వారు నీటితో తీసుకోవచ్చు. కానీ ఆ సమయంలో తీసుకునే భోజనంలో కొంచెం ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే విటమిన్ డి సరిగ్గా శరీరానికి అందుతుంది.
సరైన సమయం ఎప్పుడు?
విటమిన్ డి సప్లిమెంట్లను ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ముఖ్యమే. సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్న భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో జీర్ణక్రియ చురుకుగా ఉండి విటమిన్ శోషణ మెరుగ్గా జరుగుతుంది. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొంతమందిలో కడుపులో అసౌకర్యం లేదా వికారం కలిగే అవకాశం ఉంది.
అతిగా వాడితే ప్రమాదమే
ఎముకల నొప్పి, అలసట ఉన్నాయని డాక్టర్ సలహా లేకుండా సొంతంగా విటమిన్ డి మాత్రలు వాడటం ప్రమాదకరం.
కాల్షియం పెరగడం: విటమిన్ డి మోతాదు ఎక్కువైతే శరీరంలో కాల్షియం స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఇది మూత్రపిండాలు, గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పరీక్ష తప్పనిసరి: రక్త పరీక్ష చేయించుకోకుండా దీర్ఘకాలం పాటు ఈ సప్లిమెంట్లు వాడకూడదు.
సప్లిమెంట్లు తీసుకున్నప్పటికీ, రోజూ కనీసం 15-20 నిమిషాలు నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఎండలో గడపడం మర్చిపోవద్దు. సహజ సిద్ధమైన ఎండకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు.

