Ap Health : డిసిహెచ్ యస్ల పనితీరులో మార్పు రావాలి
డిసిహెచ్‌యస్‌లకు రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్

- జిల్లా అధికారులు లీడ్ చేసే లీడర్లుగా ఎదగాలి
- సిజేరియన్ ఆపరేషన్లు బాగా తగ్గాలి… సాధారణ ప్రసవాలు పెరగాలి
- సెకండరీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ప్రిఆథరైజేషన్లు పెంచాలి
- సమయపాలన పాటించని డాక్టర్లను ఉపేంక్షించేది లేదు
జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల(డిసిహెచ్‌య స్‌ల) పనితీరులో మార్పురావాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రెండు నెలల క్రితం డిసిహెచ్‌యస్‌లు, డిఎంహెచ్వోల సమీక్షా సమావేశంలో పలు కీలకాంశాల్ని గమనించానని, వాటిని సరిచేసేందుకు శిక్షణ ఇవ్వాలని భావించామని మంత్రి తెలిపారు. జిల్లాల్లో టీంను లీడ్ చేసే లీడర్లుగా జిల్లా అధికారులు ఎదగాలన్నారు. తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 26 జిల్లాల డిసిహెచ్‌యస్‌లకు నాలుగు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ రూపొందించిన సమగ్ర యాప్ ను మంత్రి ఆవిష్కరించారు. డిసిహెచ్‌యస్‌లను ద్దేశించి మంత్రి మాట్లాడుతూ అవినీతిని ఏమాత్రం సహించేది లేదన్నారు. సమన్వంతో పనిచేయడం ద్వారా వైద్యసేవల్లో ఆశించిన మార్పు తీసుకురావాలని, డిసిహెచ్ యస్ లుగా మీమీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేయాలని, డిసిహెచ్ యస్ ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించడం వల్ల వాస్తవ పరిస్థితుల్ని తెసుకోగలుగుతారన్నారు. సమయపాలన పాటించని డాక్టర్ల విషయంలో ఉపేక్షించేదిలేదన్నారు. వ్యక్తిగత విషయాలకంటే రోగుల సేవకు ప్రాధాన్యతనివ్వాలని, ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యమే ప్రధానమనే విషయాన్ని గ్రహించాలని, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకిత భావంతో పనిచేయాలని మంత్రి తెలిపారు. సెకండరీ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లను బాగా తగ్గించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అలాగే సెకండరీ ఆసుపత్రుల్లో 41 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు నమోదయ్యాయని, వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఏడాదిలో సెకండరీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల్ని ఆశించిన మేర కల్పించామని, 90 ఆసుపత్రుల్లో అల్ట్రా సోనోగ్రఫీ(యుఎస్‌జి) సర్వీసుల్ని కల్పించామని, 149 ఎక్స్‌రే యంత్రాల్ని ఏర్పాటు చేశామని, 89 ఆసుపత్రుల్లో టెలీరేడియాలజీ సర్వీసుల్ని కల్పించామని, 20 కొత్త డయాలసిస్ సెంటర్లను నెలకొల్పామని మంత్రి తెలిపారు. 13 కొత్త ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరెటరీలను(ఐపిహెచ్ ఎల్) ఏర్పాటు చేశామని, ప్రతి ఐపిహెచ్ ఎల్ ల్యాబ్‌లో 139 డయాగ్నస్టిక్ టెస్టులు చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 15,000 మంది డాక్టర్లు ప్రజారోగ్య రంగంలో సేవలందిస్తున్నారని, వీరిలో డిఎంహెచ్వోలు, డిసిహెచ్‌యస్‌లు, స్టేట్ నోడల్ ఆఫీసర్లు ఉన్నారని, పాలనాపరమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వారు నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు
