Heart Attack: ఒకప్పుడు గుండెపోటు అంటే కేవలం వృద్ధాప్యంలోనో, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిలోనో కనిపించే సమస్యగా భావించేవారు. కానీ మారుతున్న జీవనశైలి, తీవ్రమైన పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా నేడు యువత కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గుండెపోటు ఒక్కసారిగా వచ్చిపడే ప్రమాదమే అయినప్పటికీ.. అది సంభవించడానికి కొన్ని గంటలు లేదా రోజుల ముందే మన శరీరం పలు హెచ్చరిక సంకేతాలను పంపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో కనిపించే వివిధ రకాల నొప్పులు, అసౌకర్యాన్ని సకాలంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

ఛాతీలో అసౌకర్యం, బరువుగా అనిపించడం

గుండెపోటుకు ప్రధాన సంకేతం ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడి. ఛాతీపై ఎవరో పెద్ద బరువు పెట్టినట్లు, పట్టేసినట్లు లేదా బిగుతుగా అనిపించవచ్చు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు స్థిరంగా ఉండటం లేదా వస్తూ పోతూ ఉండటం జరుగుతుంది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఇలాంటి అసౌకర్యం అనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

చేతుల్లో నొప్పి

గుండెపోటు నొప్పి ఛాతీ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా భుజం నుంచి మొదలై ఎడమ చేయి లేదా వేళ్ల వరకు నొప్పి పాకుతుంది. కొందరిలో ఈ నొప్పి రెండు చేతుల్లోనూ కనిపించవచ్చు. చేతులు బలహీనపడటం, తిమ్మిరి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి.

దవడ, మెడ, గొంతు నొప్పి

చాలామంది గుండె సమస్య కేవలం ఛాతీకే పరిమితం అనుకుంటారు. కానీ మెడ, దవడ, పంటి చిగుళ్లు లేదా గొంతు భాగంలో తీవ్రమైన నొప్పి, పట్టేసిన భావన కలగడం కూడా గుండెపోటుకు బలమైన సూచిక. వైద్య పరిశోధనల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి

రెండు భుజాల మధ్య వీపు పైభాగంలో వచ్చే నొప్పిని చాలామంది సాధారణ కండరాల నొప్పో, అలసటో అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ గుండె రక్తనాళాల్లో అవరోధం ఏర్పడినప్పుడు ఆ నొప్పి వీపు పైభాగానికి విస్తరించే ప్రమాదం ఉంది. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా వీపులో ఆకస్మిక నొప్పి వస్తే తేలికగా తీసుకోకూడదు.

ఎసిడిటీగా భ్రమపడే పొట్ట నొప్పి

గుండెపోటుకు ముందు పై పొట్టలో తీవ్రమైన మంట, బరువుగా అనిపించడం, వికారం లేదా అజీర్ణం వంటి లక్షణాలు ఎదురవుతాయి. చాలామంది దీనిని సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య లేదా ఎసిడిటీ అనుకుని మాత్రలు వేసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే ప్రాణాల మీదకు తెస్తుంది. ఎలాంటి కారణం లేకుండా కడుపులో అసౌకర్యం, పైభాగంలో నొప్పి వస్తూ ఉంటే వెంటనే ఈసీజీ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

సకాలంలో గుర్తింపు.. ప్రాణ రక్షణ

శరీరంలో కనిపించే ఈ నొప్పులతో పాటు ఆకస్మికంగా చల్లని చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకారణంగా తల తిరగడం వంటివి కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. ప్రాథమిక లక్షణాలను గుర్తించి గోల్డెన్ అవర్ లో సరైన వైద్య సాయం అందిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Next Story