Throwing Away Fruit Peels: పండ్ల తొక్క తీసి పారేస్తున్నారా? అయితే ఈ అద్భుత ప్రయోజనాలు కోల్పోయినట్టే..
అయితే ఈ అద్భుత ప్రయోజనాలు కోల్పోయినట్టే..
Throwing Away Fruit Peels: సాధారణంగా మనం ఏదైనా పండు తినాలంటే ముందుగా చేసే పని దాని తొక్క తీసి పారేయడం. కానీ మనం చెత్త బుట్టలో వేసే ఆ తొక్కల్లోనే అసలైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? పండ్ల గుజ్జు కంటే కొన్ని రెట్లు ఎక్కువ పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఈ తొక్కల్లోనే ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్ల తొక్కలు కేవలం పైన ఉండే పొరలు మాత్రమే కాదు.. అవి పోషకాల గనులు.
తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరప్రసాదం. ఆపిల్, ద్రాక్ష, కివి వంటి పండ్ల తొక్కలలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ద్రాక్ష, జామ తొక్కల్లో ఉండే రెస్వెరాట్రాల్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.
ఏ తొక్కతో ఏ ప్రయోజనం?
ఆపిల్ తొక్క: ఆపిల్ తొక్కలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే ఆపిల్‌ను తొక్క తీయకుండా తినడమే శ్రేయస్కరం.
నారింజ - నిమ్మ: వీటి తొక్కల్లో విటమిన్ సి, ఎ తో పాటు కాల్షియం, ఐరన్ ఉంటాయి. వీటిని ఎండబెట్టి పొడి చేసి చర్మానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
దోసకాయ: దోసకాయ తొక్కలో ఉండే సిలికా ఎముకల బలానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కివి - జామ: కివి తొక్క శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. జామ తొక్క రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
పండ్ల తొక్కలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, నేటి కాలంలో పండ్లపై పురుగుమందుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అందుకే తొక్కతో సహా తినే ముందు పండ్లను ఉప్పు నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో శుభ్రంగా కడిగి వాడాలి. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.



