Thyroid vs PCOS: నిరంతర అలసట.. ఎంత జాగ్రత్తగా తిన్నా అకస్మాత్తుగా బరువు పెరగడం.. జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం.. ఇలాంటి లక్షణాలు కనిపించగానే చాలామంది మహిళలు తమకు థైరాయిడ్ సమస్య ఉందేమోనని కంగారుపడుతుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలే కానక్కర్లేదు, వీటికి కారణం 'పీమోస్' (PMOS) కూడా కావచ్చు.

ఇంతకీ ఏంటో తెలుసా ఈ పీమోస్? మనం సాధారణంగా పిలుచుకునే 'పీసీఓఎస్' (PCOS) అనే హార్మోన్ల సమస్యను ఇప్పుడు వైద్య నిపుణులు 'పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్' లేదా 'పీమోస్' (PMOS) అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం అండాశయాలకే పరిమితం కాకుండా.. హార్మోన్లు, జీవక్రియ, ఇన్సులిన్ నిరోధకత, గుండె ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

న్యూఢిల్లీ మణిపాల్ హాస్పిటల్ గైనకాలజీ చైర్మన్ డాక్టర్ లీనా ఎన్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీమోస్, థైరాయిడ్ లోపాలు ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. దీనివల్ల సరైన వైద్య పరీక్షలు చేయించుకోకుండా అసలు సమస్య ఏంటో గుర్తించడం కష్టమవుతుంది.

డాక్టర్ శ్రీధర్ ప్రకారం.. సొంత వైద్యం లేదా తప్పుడు నిర్ధారణల వల్ల విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వైద్యులు థైరాయిడ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోన్ల పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా అసలు సమస్యను గుర్తిస్తారు.

పీమోస్ సమస్యను ఎలా అదుపు చేయవచ్చు?

మంచి ఆహారం: ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పంచదార, జంక్ ఫుడ్‌ను పూర్తిగా పక్కన పెట్టాలి.

క్రమం తప్పని వ్యాయామం: ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.

బరువు నియంత్రణ: బరువును కాస్త తగ్గించుకున్నా పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది.

సరిపడా నిద్ర, ఒత్తిడి నిర్వహణ: సరైన నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది. యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

మీ పీరియడ్స్ క్రమం తప్పకుండా రాకపోతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. భవిష్యత్తులో వచ్చే సంతానలేమి, ఇతర మెటబాలిక్ సమస్యలను నివారించాలంటే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story