జర భద్రం.. ఇవి మీ కాలేయాన్ని దెబ్బతీయొచ్చు..!

Ayurvedic Supplements: రోగనిరోధక శక్తి పెంచే పేరుతో చాలా మంది ఆయుర్వేద సప్లిమెంట్లు లేదా టానిక్స్ వాడుతుంటారు. అయితే ఈ ఉత్పత్తులు మన కాలేయానికి ఎంతవరకు సురక్షితం..?

మద్యపానం, మధుమేహం లేదా కాలేయ వ్యాధికి సంబంధించిన ఇతర లక్షణాలు లేని వ్యక్తికి అకస్మాత్తుగా సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం) వస్తే ఏమి జరుగుతుంది..? ఈ ప్రశ్నను లేవనెత్తుతూ డాక్టర్ బెపారి తన తండ్రి అనుభవాన్ని పంచుకున్నారు.

డాక్టర్ తండ్రికి సిర్రోసిస్ ఎలా వచ్చింది?

డాక్టర్ బెపారి తండ్రి ప్రోస్టేట్ సమస్యతో ఆసుపత్రిలో చేరినప్పుడు.. తాగని వ్యక్తి అయినప్పటికీ అతనికి సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి కారణం ఏమై ఉంటుందని డాక్టర్ ఆశ్చర్యపోయారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి తన రోగనిరోధక శక్తిని పెంచడానికి అతను ప్రతిరోజూ అనేక ఓవర్-ది-కౌంటర్ ఆయుర్వేద సప్లిమెంట్లను తీసుకుంటున్నారని, చాలా సంవత్సరాలుగా ఇదే కొనసాగిస్తున్నారని డాక్టర్ చెప్పారు. అతను ప్రోస్టేట్ సమస్య కోసం ఆసుపత్రిలో చేరకపోతే, ఈ కాలేయ వ్యాధి వెలుగులోకి రాకపోతుండే. చివరకు మరింత తీవ్రమైన స్థితికి దారితీసేదని కూడా వైద్యులు తెలిపారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఆయుర్వేద ఉత్పత్తుల వల్ల కాలేయానికి హాని కలుగుతుందని 2020 అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఆయుర్వేద మందులు తేలికపాటి ఎంజైమ్ పెరుగుదల నుండి సిర్రోసిస్ వరకు దేనికైనా కారణమవుతాయని వారు కనుగొన్నారు.

కాలేయానికి హాని కలిగించే కొన్ని సాధారణ ఆయుర్వేద పదార్థాలు:

అశ్వగంధ: ఇది కాలేయం దెబ్బతినడానికి, కాలేయ వైఫల్యానికి కారణమవుతుందని అనేక నివేదికలలో తేలింది.

పసుపు/కర్కుమిన్: ఆహారంలో చేర్చుకోవడం సురక్షితమే అయినప్పటికీ అధిక మోతాదులో సాంద్రీకృత సప్లిమెంట్లు కాలేయ వ్యాధికి కారణం కావచ్చు.

గ్రీన్ టీ సారం: వీటిని బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఇవి కూడా కాలేయానికి హాని చేయవచ్చు.

మల్టీ-హెర్బ్ పొడిలు: అనేక ఆయుర్వేద ఫార్ములాలు వివిధ రకాల మూలికలతో తయారు చేస్తారు. కొన్ని అధ్యయనాలలో ఈ మిశ్రమాలలో ఆర్సెనిక్, పాదరసం వంటి భారీ లోహాలు అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఇది కాలేయ రోగులలో మరణానికి కూడా దారితీస్తుంది.

మీరు ఆయుర్వేద ఉత్పత్తులను వాడుతుంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కాలేయానికి నష్టం జరగకుండా ఉండాలంటే, ఆయుర్వేద సప్లిమెంట్లు వాడేవారు తప్పకుండా ఈ విషయాలు పాటించాలి:

1. లైసెన్స్ పొందిన ఉత్పత్తులను మాత్రమే కొనండి.

2. ఉత్పత్తిపై సిఫార్సు చేయబడిన మొత్తాన్ని మాత్రమే తీసుకోండి.. అతిగా వాడకండి.

3. మీరు తీసుకునే అన్ని సప్లిమెంట్ల గురించి మీ వైద్యుడికి తప్పకుండా చెప్పండి.

సహజ ఉత్పత్తులు అని చెప్పి అతిగా వాడటం వల్ల కాలేయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి రోగనిరోధక శక్తి కోసం సప్లిమెంట్లు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story