Eye Drops: కళ్లలో దురద, మంట, పొడిబారడం లేదా చిన్నపాటి ఇన్ఫెక్షన్ రాగానే చాలామంది చేసే మొదటి పని ఇంట్లో ఉన్న ఐ డ్రాప్స్ వేసుకోవడం. అయితే ఆ సీసా మూత ఎప్పుడు తెరిచారో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఇంకా ఉందనే ధీమాతో తెరిచిన నెలల తర్వాత కూడా వాడుతుంటారు. కానీ, ఈ నిర్లక్ష్యం తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్లకు, చివరకు కంటిచూపు దెబ్బతినడానికి దారితీస్తుందని నేత్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్స్‌పైరీ డేట్ ఉంటే సరిపోదా?

చాలామంది చేసే ప్రధాన పొరపాటు బాటిల్‌పై ఉన్న గడువు తేదీని చూసి మోసపోవడం.

ఎక్స్‌పైరీ డేట్: సీసా మూత తెరవకుండా భద్రపరిచినంత కాలం మాత్రమే ఇది వర్తిస్తుంది.

యూజ్-బై డేట్: సీల్ తెరిచిన రోజు నుంచే అసలైన కౌంట్‌డౌన్ మొదలవుతుంది. సాధారణంగా మల్టీ-డోస్ కంటి చుక్కల మందులను తెరిచిన 28 నుండి 30 రోజులలోపు మాత్రమే వాడాలని గ్వాలియర్‌కు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పురేంద్ర భాసిన్ స్పష్టం చేస్తున్నారు.

సీసా మూత తెరవగానే గాలిలోని బ్యాక్టీరియా, దుమ్ము డ్రాపర్‌లోకి చేరతాయి. కాలం గడిచేకొద్దీ లోపల సూక్ష్మజీవులు పెరిగి మందు కలుషితమవుతుంది.

ప్రిజర్వేటివ్ లేని డ్రాప్స్ విషయంలో మరింత జాగ్రత్త

మార్కెట్లో ప్రిజర్వేటివ్-రహిత కంటి చుక్కల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.

సింగిల్ డోస్ బాటిల్స్: ఇవి ఒక్కసారి వాడి వెంటనే పారేయాల్సినవి (యూజ్ అండ్ త్రో). వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ ఉపయోగించకూడదు.

స్పెషల్ ప్యాకేజింగ్ బాటిల్స్: కొన్ని ప్రత్యేక డిజైన్లతో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వస్తాయి. కాబట్టి, డ్రాప్స్ కొన్నప్పుడు ప్యాకేజీపై ఉన్న లేబుల్ సూచనలను చదవడం తప్పనిసరి.

సాధారణంగా చేసే పొరపాట్లు - ప్రమాదాలు

డ్రాపర్ కొనను కనురెప్పలకు, వేళ్లకు లేదా చర్మానికి తాకించడం వల్ల చేతులపై ఉండే సూక్ష్మజీవులు నేరుగా మందులోకి వెళ్తాయి. ఇలాంటి కలుషితమైన చుక్కలు వేసుకుంటే కండ్లకలక, కార్నియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇన్ఫెక్షన్ కార్నియా లోపలికి పాకితే చూపు శాశ్వతంగా మందగించే ప్రమాదం ఉంది.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి

కళ్లు తీవ్రంగా ఎర్రబడటం

ఆగని కంటి నొప్పి

నీరు లేదా చీము వంటి ద్రవాలు కారడం

కళ్ల చుట్టూ వాపు రావడం

వెలుతురును చూడలేకపోవడం (ఫోటోఫోబియా)

చూపు మసకబారడం

సురక్షిత వినియోగానికి 6 సువర్ణ సూత్రాలు

తేదీ రాయండి: సీసా మూత తెరిచిన రోజే దానిపై మార్కర్‌తో తేదీని రాయండి. 30 రోజుల తర్వాత ఇంకా మిగిలి ఉన్నా నిర్దాక్షిణ్యంగా పారేయండి.

చేతుల శుభ్రత: డ్రాప్స్ వేసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.

తాకవద్దు: డ్రాపర్ కొనను కంటికి, చర్మానికి లేదా వేళ్లకు తగలకుండా పైనుంచే చుక్కలు వేయండి.

వెంటనే మూత పెట్టండి: డ్రాప్స్ వేసిన మరుక్షణమే మూతను గట్టిగా బిగించండి.

భద్రపరచడం: తయారీదారు సూచించినట్లుగా చల్లని ప్రదేశంలో ఉంచండి; అధిక వేడి, ఎండ తగిలే చోట పెట్టవద్దు.

షేరింగ్ వద్దు: ఒకరి కంటి చుక్కల మందును మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు

Next Story