UTI Problems During Pregnancy: గర్భధారణ సమయంలో యూటీఐ సమస్య.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

UTI Problems During Pregnancy: గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో మధురమైన, ప్రత్యేకమైన దశ. అయితే ఈ సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల గర్భిణీలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ప్రధానమైనది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్య సాధారణంగానే కనిపించినప్పటికీ, దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్ఫెక్షన్‌కు గల కారణాలు ఇవే..
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది గర్భాశయంతో పాటు మూత్ర వ్యవస్థ కండరాలను కూడా సడలించేలా చేస్తుంది. ఫలితంగా మూత్రం మూత్రాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోయి, పూర్తిగా బయటకు రాదు.
దీనికి తోడు గర్భాశయం పరిమాణం పెరిగేకొద్దీ మూత్ర నాళంపై ఒత్తిడి పెరిగి, మూత్ర ప్రవాహం నెమ్మదిస్తుంది. అలాగే గర్భిణీల మూత్రంలో చక్కెర, అమైనో ఆమ్లాల పరిమాణం కొద్దిగా పెరగడం వల్ల అక్కడ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
ముఖ్యమైన లక్షణాలు..
క్రింది లక్షణాలు కనిపిస్తే అది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌గా గుర్తించాల్సి ఉంటుంది.
మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి రావడం.
తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.
పొత్తికడుపు, నడుము భాగంలో నొప్పి.
మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం లేదా దుర్వాసన రావడం.
ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి కొన్నిసార్లు జ్వరం లేదా చలి రావడం.
గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు అలాగే సమస్య అదుపులో ఉండేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఎక్కువగా నీరు తాగాలి:
రోజుకు తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతుంది.
హైడ్రేటింగ్ పండ్లు: పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత:
ప్రైవేట్ భాగాల క్లీన్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
తీపి పదార్థాలు తగ్గించాలి:
చక్కెర మరియు స్వీట్ల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది.
మూత్రాన్ని ఆపకూడదు:
ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని ఆపుకోకుండా క్రమ పద్ధతిలో విసర్జించాలి.
కాటన్ దుస్తులు:
ప్రతిరోజూ వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించడం ఉత్తమం.
గర్భధారణ సమయంలో పైన పేర్కొన్న లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా స్వీయ వైద్యం జోలికి వెళ్లకుండా, వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ఎంతో సురక్షితం.

