వైద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్‌ సమీక్ష

  • రూ.1,129 కోట్ల వ్య‌యంతో 4,472 విలేజ్ హెల్త్ క్లినిక్ భ‌వ‌నాల నిర్మాణానికి మంత్రి ఆమోదం
  • ఏడాదిలోగా ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశం
  • భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు 80 శాతం మేర‌ కేంద్రం సాయమందిస్తుందని మంత్రి వెల్లడి
  • శ్రీకాకుళం జిల్లాలో అత్య‌ధికంగా 284 భ‌వ‌నాలు

రాష్ట్రంలో ప్ర‌జారోగ్యాన్ని పటిష్టం చేసే దిశగా 4,472 గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ ల‌కు భారీ వ్య‌యంతో సొంత భ‌వ‌నాల్ని నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ నిర్మాణాల కోసం రూ.1129 కోట్లు వ్య‌యం చేయ‌నుంది. 26 జిల్లాల్లో 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్ లు వైద్య సేవ‌ల్ని అందిస్తున్నాయి. వీటిలో 1,086 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రభుత్వ భ‌వ‌నాల్లో ఉన్నాయి. మిగిలిన‌ వాటిలో ఎక్కువ భాగం అద్దె భ‌వ‌నాల్లో న‌డుస్తున్నందున ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లందించే క్ర‌మంలో ప‌లు స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క్షేత్రస్థాయి ప‌రిస్థితుల‌పై ఉన్న‌తాధికారుల‌తో వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.1129 కోట్ల వ్య‌యంతో 4,472 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ ల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించ‌డానికి మంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా గ‌త ప్ర‌భుత్వం నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్టి నిధుల విడుద‌ల‌లో ఆల‌స్యం కార‌ణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన 2,309 భ‌వ‌నాల నిర్మాణాల‌ను పూర్తి చేయనున్నారు. దీంతో పాటు మ‌రో 2,163 నూత‌న భ‌వ‌న నిర్మాణ ప‌నుల్ని15వ ఆర్థిక సంఘం నిధుల‌తో చేప‌డ‌తారు. హెల్త్ క్లినిక్ ల‌కు సొంత భ‌వ‌నాల ప్రాధాన్య‌త దృష్ట్యా ఈ నిర్మాణ ప‌నుల్ని ఏడాదిలోపు పూర్తి చేయాల‌ని, ఈమేర‌కు నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్ట‌నున్న పంచాయితీరాజ్ శాఖ‌తో నిరంత‌రం స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కుంటుప‌డిన ప‌నులు

మొత్తం 8,946 విలేజ్ హెల్త్ క్లినిక్ ల‌కు సొంత భ‌వ‌నాలు ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా గ‌త ప్ర‌భుత్వం 3,105 భ‌వ‌నాల్ని మాత్ర‌మే నిర్మించింది. ఎన్ఆర్ ఇజియ‌స్, ఎన్ హెచ్ఎం నిధుల‌తో మ‌రో 2,309 భ‌వ‌న నిర్మాణ ప‌నులు ప్రారంభించి అర్ధాంత‌రంగా నిలిపివేసింది. ఇలా చేప‌ట్టిన 5,414 భ‌వ‌న నిర్మాణాల‌కు ఒక్కోదానికి రూ.8.75 ల‌క్ష‌లు చొప్పున కేంద్రమిచ్చే ఎన్ఆర్ ఇజియ‌స్ నిధుల‌ను వాడారు. 2019-20 నాటి రేట్ల ప్ర‌కారం ఒక్కో భ‌వ‌నం నిర్మాణానికి రూ.20.80 ల‌క్ష‌లుగా అప్ప‌ట్లో నిర్ధారించారు. ఎన్ఆర్ ఇజియ‌స్ నిధుల‌కు అద‌నంగా ఒక్కో భ‌వ‌న నిర్మాణానికి ఎన్‌హెచ్ఎం ప‌ధ‌కం కింద రూ. 12.05 ల‌క్ష‌ల‌ను కేటాయించ‌గా ఇందులో కేంద్రం 60 శాతం వాటాను అందించింది.అయినా నిర్మాణ ప‌నులు ఆల‌స్య‌మ‌య్యాయి.

భారీగా కేంద్ర సాయం

గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించే ఉద్దేశంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల స్థాప‌న‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మున్నెన్న‌డూ లేనివిధంగా ప్ర‌తి గ్రామంలో హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం ప్రారంభం చేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ ల‌కు సొంత భ‌వ‌నాల ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం భారీగా సాయ‌మందించింద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో చేప‌ట్టిన నిర్మాణ ప‌నుల‌కు, ఇప్పుడు చేప‌ట్ట‌నున్న నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం ఖ‌ర్చులో 80 శాతాన్ని కేంద్రమే అందిస్తోందని మంత్రి తెలిపారు.

హెల్త్ క్లినిక్ నిర్మాణాల కోసం ఎన్‌హెచ్ఎం మ‌రియు పిఎం-అభిమ్ ప‌థ‌కాల కింద కేంద్రం 60 శాతం ఖ‌ర్చును భ‌రిస్తుంద‌ని, దీంతోపాటు 100 శాతం గ్రాంటుగా ల‌భించే 15వ ఆర్థిక సంఘం నిధుల‌తో కూడా హెల్త్ క్లినిక్ నిర్మాణ ప‌నుల‌ను చేప‌డుతున్నామ‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. ఈ మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన నిర్మాణ ప‌నులు, ఇప్పుడు ఆమోదించిన నిర్మాణ ప‌నుల‌కు మొత్తం రూ.2,254 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని, ఇందులో రూ.1,808 కోట్లు కేంద్ర సాయమ‌ని మంత్రి తెలిపారు. ద‌రిమిలా... రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు అయ్యే మొత్తం ఖ‌ర్చులో 80 శాతం కేంద్రమే అందిస్తోంద‌ని మంత్రి విశ‌దీక‌రించారు.

రాష్ట్రంలో మ‌రో 1,379 నూత‌న భ‌వ‌నాల‌ను రూ.753 కోట్ల ఖ‌ర్చుతో నిర్మించాల్సి ఉంద‌ని, వీటిని 16వ ఆర్థిక సంఘం నిధుల‌తో చేప‌ట్టేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. పూర్తి గ్రాంటుగా ల‌భించే ఈ నిధుల‌తో క‌లిపి రాష్ట్రంలో హెల్త్ క్లినిక్ భ‌వ‌నాల‌కు అయ్యే మొత్తం ఖ‌ర్చులో 85 శాతం కేంద్ర‌మే ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని మంత్రి వివ‌రించారు. ఈ భారీ సాయానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీకి మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జిల్లాల వారీగా భ‌వ‌న నిర్మాణ వివ‌రాలు

రూ.1129 కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అత్య‌ధికంగా 284 విలేజ్ హెల్త్ క్లినిక్ ల‌కు సొంత భ‌వ‌నాలు ఏర్ప‌డ‌నున్నాయి. త‌రువాతి క్ర‌మంలో నంద్యాల జిల్లాలో 272, ఏలూరు జిల్లాలో 263, కోన‌సీమ జిల్లాలో 242, కృష్ణా జిల్లాలో 240, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో 239, చిత్తూరు జిల్లాలో 229, బాప‌ట్ల జిల్లాలో 211, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో 205, ప్రకాశం మ‌రియు నెల్లూరు జిల్లాల్లో 203 చొప్పున, అన‌కాప‌ల్లి జిల్లాలో 200 నూత‌న భ‌వ‌నాలు ఏర్ప‌డ‌తాయి. గుర్తించిన అవ‌స‌రాల మేర‌కు...రాయ‌ల‌సీమ‌లోని తిరుప‌తి, క‌ర్నూలు, అన్న‌మ‌య్య‌, అనంత‌పురం, శ్రీ స‌త్య‌సాయి జిల్లాల్లో ఒక్కోచోట 100కి పైగా నూత‌న భ‌వ‌నాల్ని నిర్మిస్తారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story