Waking Up With a Headache: ఉదయాన్నే తలనొప్పి వేధిస్తోందా? మెదడు కణితి ప్రారంభ లక్షణాలపై నిపుణుల హెచ్చరిక
నిపుణుల హెచ్చరిక

Waking Up With a Headache: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో తలనొప్పి అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. చాలామంది దీనిని మైగ్రేన్, ఎసిడిటీ లేదా కంటి సమస్యగా భావించి పెయిన్ కిల్లర్లతో సరిపెట్టుకుంటారు. అయితే నిరంతరం వేధించే తీవ్రమైన తలనొప్పి మెదడు కణితి ప్రారంభ సంకేతం కావచ్చని వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు హెచ్చరిస్తున్నాయి.
సాధారణ తలనొప్పికి, బ్రెయిన్ ట్యూమర్ నొప్పికి తేడా ఏమిటి?
ఉదయం వేళల్లో తీవ్రత: రాత్రి నిద్ర సమయంలో మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల, నిద్రలేవగానే తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.
ఒత్తిడితో పెరిగే నొప్పి: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా కిందకు వంగినప్పుడు తలలో నొప్పి మరింత ఎక్కువవుతుంది.
నొప్పి తగ్గకపోవడం: సాధారణ పెయిన్ కిల్లర్స్ వాడినా నొప్పి ఏమాత్రం తగ్గకపోవడం లేదా రోజురోజుకూ తీవ్రత పెరగడం.
తప్పక గమనించాల్సిన 5 కీలక హెచ్చరిక సంకేతాలు
వికారం - వాంతులు: ఉదయం తలనొప్పితో పాటు అకస్మాత్తుగా వాంతులు కావడం లేదా నిరంతరం వికారంగా అనిపించడం.
దృష్టి లోపాలు: కళ్ల ముందు చీకట్లు కమ్మడం, వస్తువులు రెండేసిగా కనిపించడం (డబుల్ విజన్), చూపు మసకబారడం.
మూర్ఛలు : గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా అకస్మాత్తుగా ఫిట్స్ రావడం లేదా శరీరం వణకడం.
సమతుల్యత లోపించడం - బలహీనత: నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, మాట తడబడటం, లేదా శరీరంలో ఒక వైపు (చేయి, కాలు) బలహీనపడటం.
జ్ఞాపకశక్తి - ప్రవర్తన మార్పులు: విషయాలను త్వరగా మర్చిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు రావడం.
ముందస్తు గుర్తింపుతోనే ప్రాణ రక్షణ
WHO ప్రకారం మెదడులోని కణితిలన్నీ క్యాన్సర్ కావు చాలావరకు నిరపాయమైనవి. అయినప్పటికీ అవి మెదడులోని కీలక భాగాలపై ఒత్తిడి తెస్తాయి కాబట్టి సకాలంలో గుర్తించడం ముఖ్యం.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. వైద్యుల సలహా మేరకు MRI లేదా CT స్కాన్ ద్వారా ప్రారంభ దశలోనే కణితిని గుర్తిస్తే, సర్జరీ, రేడియేషన్ లేదా కీమోథెరపీతో చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చు.

