Waking Up with a Headache: ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తోందా? నిద్రపోయే ముందు మీరు చేసే ఈ తప్పులే కారణం..
ఈ తప్పులే కారణం..

Waking Up with a Headache: రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచినప్పుడు శరీరం, మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉండాలి. కానీ చాలామందికి నిద్రలేవగానే తీవ్రమైన తలనొప్పి, బరువుగా అనిపించడం, నీరసం వంటివి ఎదురవుతుంటాయి. ఈ సమస్య వల్ల రోజంతా అసౌకర్యంగా గడవడమే కాకుండా దినచర్య దెబ్బతింటుంది. ఉదయం పూట వచ్చే తలనొప్పిని సాధారణ సమస్యగా కొట్టిపారేయలేమని, రాత్రిపూట పడుకునే ముందు మనం చేసే కొన్ని అలవాట్లు, నిద్రలో తలెత్తే లోపాలే దీనికి ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తలనొప్పికి దారితీసే సాధారణ కారణాలు, వాటిని నివారించే మార్గాలను ఇక్కడ పరిశీలిద్దాం.
ఉదయాన్నే తలనొప్పి ఎందుకు వస్తుంది? ప్రధాన కారణాలు ఇవే:
డీహైడ్రేషన్
రోజంతా సరిపడా నీరు తాగకపోవడం లేదా రాత్రి నిద్రపోయే ముందు డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల ఉదయం మెదడు కణజాలంపై ఒత్తిడి పడి తలనొప్పి మొదలవుతుంది. నిద్రలో సుమారు 7-8 గంటలు శరీరానికి నీరు అందదు కాబట్టి, ముందే నీటి కొరత ఉంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.
నిద్రలేమి లేదా మితిమీరిన నిద్ర
తక్కువ నిద్ర: రాత్రి 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మెదడుకు తగిన విశ్రాంతి దక్కక ఒత్తిడి హార్మోన్లు విడుదలై తలనొప్పి వస్తుంది.
ఎక్కువ నిద్ర:
సాధారణ సమయం కంటే ఎక్కువగా పడుకోవడం వల్ల కూడా శరీరంలోని బయోలాజికల్ క్లాక్ దెబ్బతిని, న్యూరోట్రాన్స్‌మిటర్లలో అసమతుల్యత ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది.
స్క్రీన్ టైమ్, రాత్రిపూట టీ, కాఫీలు
పడుకునే ముందు ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటుంది. అలాగే రాత్రిపూట కెఫిన్ ఉన్న టీ, కాఫీలు తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతిని ఉదయం తీవ్ర తలనొప్పిగా మారుతుంది.
స్లీప్ అప్నియా - గురక
నిద్రలో గురక పెట్టేవారు లేదా ఊపిరి సరిగ్గా ఆడని సమస్య (స్లీప్ అప్నియా) ఉన్నవారిలో రాత్రి సమయంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఉదయం లేవగానే తల పిండేసినట్లు నొప్పి వస్తుంది.
సరికాని దిండు, తప్పుడు భంగిమ
ఎత్తుగా ఉండే లేదా గట్టి దిండ్లు వాడటం వల్ల మెడ, భుజాల కండరాలు బిగుసుకుపోయి నరాలు ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల నిద్రలేవగానే మెడ నొప్పితో పాటు తీవ్రమైన టెన్షన్ తలనొప్పి వస్తుంది.
ఈ సమస్యను ఎలా అధిగమించాలి? (నిపుణుల సూచనలు)
నిద్ర వేళల్లో క్రమశిక్షణ:
రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
రాత్రిపూట గ్యాడ్జెట్లకు దూరం: పడుకోవడానికి కనీసం అరగంట ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయాలి.
సరైన హైడ్రేషన్:
రోజంతా సరిపడా నీరు తాగాలి. పడుకోవడానికి ముందు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది.
సౌకర్యవంతమైన దిండు:
మెడకు సహజమైన వంపునిచ్చేలా మృదువైన, సరైన ఎత్తు ఉన్న దిండును ఎంచుకోవాలి.
ఆహార జాగ్రత్తలు:
రాత్రి సమయంలో హెవీ ఫుడ్, ఆల్కహాల్, కాఫీ వంటి వాటిని పూర్తిగా నివారించాలి.

