5 Symptoms Every Morning: ఉదయం నిద్రలేవగానే ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త..
అయితే జాగ్రత్త..

5 Symptoms Every Morning: రక్తాన్ని శుద్ధి చేయడం, మలినాలను తొలగించడం, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, కిడ్నీల వడపోత సామర్థ్యం మందగించినప్పుడు శరీరం ఉదయం పూట కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపుతుంది. చాలామంది వీటిని సాధారణ అలసట లేదా నిద్రలేమిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా సమస్య ముదిరి కిడ్నీ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజీవ్ ఎం హెచ్చరిస్తున్నారు.
ఉదయం వేళ కనిపించే ఆ 5 ప్రధాన హెచ్చరిక సంకేతాలు, వాటికి గల కారణాలు:
ముఖం - కళ్ల కింద వాపు: ఉదయం అద్దంలో చూసుకున్నప్పుడు ముఖం ఉబ్బినట్లుగా లేదా కళ్ల చుట్టూ వాపు కనిపించడం ప్రాథమిక లక్షణం. మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు, శరీరంలో నిల్వ ఉండాల్సిన అల్బుమిన్ అనే ప్రొటీన్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీనివల్ల కణజాలాలలో నీరు చేరి ముఖం వాపునకు గురవుతుంది.
పాదాలు, మడమలలో వాపు: శరీరంలోని అదనపు నీరు, సోడియంను కిడ్నీలు సరిగ్గా బయటకు పంపలేనప్పుడు అవి దిగువ అవయవాలలో పేరుకుపోతాయి. రాత్రంతా నిద్రించి లేచిన తర్వాత కూడా కాళ్లు, పాదాలు, మడమలలో వాపు స్పష్టంగా కనిపిస్తే అది కిడ్నీ పనితీరు మందగించిందనడానికి సంకేతం.
నురుగు లేదా రంగు మారిన మూత్రం: ఉదయం విసర్జించే మొదటి మూత్రం సబ్బు నురుగులా దట్టంగా ఉన్నా, లేదా ఎరుపు, గోధుమ రంగులోకి మారినా అప్రమత్తం కావాలి. మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిని ప్రొటీన్లు లేదా రక్తం మూత్రంలో కలుస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది.
నోటి దుర్వాసన, లోహపు రుచి: రక్తంలో యూరియా, ఇతర వ్యర్థాల సాంద్రత పెరిగినప్పుడు ఉదయం పూట నోటి నుంచి అమ్మోనియా లేదా ఘాటైన వాసన వస్తుంది. నాలుకపై నిరంతరం లోహపు రుచి అనిపించడం వల్ల ఆహారం తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.
విపరీతమైన అలసట, తలతిరగడం: ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే 'ఎరిత్రోపొయెటిన్' అనే హార్మోన్‌ను కిడ్నీలు విడుదల చేస్తాయి. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఈ హార్మోన్ లోపించి తీవ్ర రక్తహీనతకు దారితీస్తుంది. ఫలితంగా తగినంత నిద్ర పోయినా ఉదయం లేవగానే తలతిరగడం, తీవ్ర నీరసం మరియు వికారం వంటివి వేధిస్తాయి.
ఏం చేయాలి? ఏయే పరీక్షలు అవసరం?
పై లక్షణాలలో ఏవైనా క్రమం తప్పకుండా కనిపిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాలి. సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి ఈ కింది ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం అవసరం..
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ : రక్తంలో సీరం క్రియేటినిన్, యూరియా స్థాయిలను నిర్ధారించడానికి.
కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ : మూత్రంలో ప్రొటీన్ లేదా ఎర్ర రక్త కణాలు లీక్ అవుతున్నాయా అని గుర్తించడానికి.
కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, సరైన వైద్యంతో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉదయం కనిపించే ఈ మార్పులను సాధారణ అలసటగా కొట్టిపారేయకుండా సకాలంలో స్పందించడం ఎంతో అవసరం.

