Healthy Liver: మన శరీరంలో గుండె ఎంత కీలకమో, కాలేయం కూడా అంతే ముఖ్యం. దీనిని శరీరానికి శక్తి కేంద్రం అని పిలుస్తారు. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి విష పదార్థాలను బయటకు పంపడం వరకు.. కాలేయం చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. అయితే నేటి మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ కీలక అవయవాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కాలేయం ఒకసారి దెబ్బతింటే, దానిని పూర్వస్థితికి తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే "వ్యాధి వచ్చాక బాధపడటం కంటే, రాకుండా జాగ్రత్త పడటం మిన్న" అనేదాన్ని గుర్తుంచుకోవాలి.

మీ కాలేయాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే:

మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయాన్ని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు.

ఆకుకూరలు: పాలకూర, కేల్ వంటివి కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

వెల్లుల్లి: ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి, శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

సిట్రస్ పండ్లు: నిమ్మ, ఉసిరి, నారింజ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు కాలేయంలోని అదనపు కొవ్వును తగ్గిస్తాయి.

పసుపు: ఇది కాలేయ కణాల మరమ్మత్తుకు సహాయపడటమే కాకుండా వాపును తగ్గిస్తుంది.

బీట్‌రూట్ - టమాటా: ఇవి కాలేయ పనితీరును మెరుగుపరిచి, ఆక్సీకరణ నష్టం నుండి రక్షణ కల్పిస్తాయి.

గ్రీన్ టీ - దానిమ్మ:- వీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్యాటీ లివర్ ముప్పును తగ్గించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

వీటిని గుర్తుంచుకోండి

కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, కాలేయానికి హాని చేసే అలవాట్లకు దూరంగా ఉండాలి.

మద్యపానానికి దూరం: లివర్ దెబ్బతినడానికి ప్రధాన కారణం మద్యం.

జంక్ ఫుడ్ వద్దు: వేయించిన పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి.

వ్యాయామం - నిద్ర: క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం కాలేయ ఆరోగ్యానికి చాలా అవసరం.

మన జీవనశైలిలో చేసే ఒక చిన్న సానుకూల మార్పు, మన జీవిత కాలాన్ని పెంచుతుంది. ఈ ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం.

PolitEnt Media

PolitEnt Media

Next Story