Avoid Food Poisoning During Monsoon: వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం మైండ్ కి ఎంత హాయిగా అనిపించినా, మరోవైపు ఆహారం, నీరు త్వరగా కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ఈ సీజన్ లో వర్షాకాలపు ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

మనం చేసే 6 ప్రధాన పొరపాట్లు – నివారణ మార్గాలు..

వండుకున్న ఆహారాన్ని గంటల తరబడి బయటే ఉంచడం:

చాలామంది వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చాలా గంటల పాటు అలానే వదిలేస్తుంటారు. వర్షాకాలంలోని తేమ వల్ల ఇందులో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఆహారం చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టుకోవడం, తినే ముందు మళ్ళీ బాగా వేడి చేసుకోవడం మంచిది.

పచ్చి పదార్థాలు – వండిన ఆహారాన్ని కలిపి ఉంచడం:

పచ్చి మాంసం, చికెన్ లేదా చేపలను వండిన ఆహారానికి దగ్గరగా ఉంచితే, వాటిలోని క్రిములు వండిన ఆహారంలోకి చేరుతాయి. దీన్నే క్రాస్ కంటామినేషన్ అంటారు. కాబట్టి వీటిని విడివిడిగా, సరైన మూతలు పెట్టి స్టోర్ చేయాలి.

కూరగాయలు, పండ్లను సరిగ్గా కడగకపోవడం:

వర్షాకాలంలో బురద, కలుషిత నీటి వల్ల పండ్లు, కూరగాయలపై క్రిములు ఎక్కువగా చేరతాయి. వీటిని కేవలం ఒకసారి నార్మల్ నీళ్లతో కడిగితే సరిపోదు. మంచి తాగునీటిలో శుభ్రంగా కడిగి, అవసరమైతే తొక్క తీసి ఉపయోగించడం సురక్షితం.

ఫ్రిజ్‌ను పరిమితికి మించి నింపేయడం:

ఫ్రిజ్‌లో పట్టేదాని కంటే ఎక్కువగా ఆహార పదార్థాలను అద్దకం చేస్తే, అందులో చల్లటి గాలి సమానంగా ప్రసరించదు. దీనివల్ల కొన్ని పదార్థాలు త్వరగా పాడైపోతాయి. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను కూడా ఈ సీజన్‌కు తగ్గట్టుగా సరిగ్గా నిర్వహించాలి.

వీధి వంటకాలు ఎక్కువగా తినడం:

వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే ఈగలు వాలిన తినుబండారాలు, చాలాసేపు బయట ఉంచిన స్నాక్స్ లేదా అపరిశుభ్ర వాతావరణంలో చేసే ఆహారం తినడం వల్ల విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లో తాజాగా వండిన ఆహారాన్నే తినడం శ్రేయస్కరం.

చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం:

ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం అత్యంత ముఖ్యం. మురికి చేతుల వల్ల క్రిములు కడుపులోకి వెళ్తాయి. అలాగే వంటగది గట్టు, కటింగ్ బోర్డులు, వంట పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

గుర్తుంచుకోండి: ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల వర్షాకాలంలో వచ్చే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు!

PolitEnt Media

PolitEnt Media

Next Story