Ragi Face Pack: అందంగా మెరిసిపోవాలా? ఇంట్లోనే ఇలా రాగి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి
ఇంట్లోనే ఇలా రాగి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి

Ragi Face Pack: రాగులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే రాగులు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే నల్ల మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇంట్లోనే ఈ సులభమైన ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ ప్యాక్‌కు కావలసిన పదార్థాలు:
రాగి పొడి : 2 టేబుల్ స్పూన్లు
పెరుగు : 1 టేబుల్ స్పూన్
తేనె : 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పొడిని తీసుకుని, అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. తర్వాత 1 టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం యాడ్ చేసి, పేస్ట్ నునుపుగా అయ్యే వరకు బాగా కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకునే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోవాలి. శుభ్రమైన చేతులతో ఈ ప్యాక్‌ను ముఖం, మెడకు అప్లై చేయాలి.
ప్యాక్‌ను 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత, నీటితో తడిపి వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివరిగా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
రాగి పొడి చర్మంపై సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేసి, చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. పెరుగు, తేనె చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి నల్ల మచ్చలను తొలగించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అయితే ఏదైనా కొత్త పదార్థాన్ని చర్మానికి ఉపయోగించే ముందు అలెర్జీ సమస్యలు ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
