Watching Reels for Hours: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, సోషల్ మీడియా వీడియోలను స్క్రోల్ చేయడం చాలామందికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు గంటల తరబడి ఫోన్ స్క్రీన్‌పైనే కళ్లు అతుక్కుపోతున్నాయి. అయితే ఈ అలవాటు మానసిక అలసటకే కాకుండా, శారీరక ఆరోగ్యంపై.. ముఖ్యంగా మెడ, వెన్నుపూసపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

మొబైల్ ఫోన్ చూసే సమయంలో దాదాపు అందరూ తల కిందికి దించి, వీపును ముందుకు వంచి కూర్చుంటారు. ఎక్కువ సమయం ఇదే భంగిమలో ఉండటం వల్ల మెడ భాగంలోని కండరాలపై విపరీతమైన భారం పడుతుంది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. స్క్రీన్ వైపు చూస్తూ నిరంతరం తలను ముందుకు వంచడం వల్ల ఈ క్రింది సమస్యలు తలెత్తుతాయి..

మెడ పట్టేయడం, తీవ్రమైన మెడ నొప్పి

భుజాలలో అసౌకర్యం, భారంగా అనిపించడం

వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి

మెడ కండరాల దృఢత్వం తగ్గి త్వరగా అలసిపోవడం

శారీరక శ్రమ లోపించడం మరో సమస్య

రీల్స్ వ్యసనం వల్ల శారీరక కదలికలు దాదాపు శూన్యమవుతాయి. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాల అలసట, వెన్నునొప్పి సమస్యలు చుట్టుముడతాయి. రాత్రి వేళల్లో పడకపై పడుకుని ఫోన్ చూడటం నిద్ర నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. అయితే, రీల్స్ చూడటం నేరుగా బోలు ఎముకల వ్యాధికి (ఆస్టియోపోరోసిస్ - ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడే సమస్య) కారణమవుతుందని చెప్పలేకపోయినా, నిశ్చల జీవనశైలి ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

కంటి స్థాయిలోనే ఫోన్ ఉంచండి

మొబైల్ చూసేటప్పుడు తలను కిందకు వంచకుండా, ఫోన్‌ను నేరుగా మీ కంటి లెవల్‌కు వచ్చేలా పట్టుకోవాలి.

క్రమం తప్పకుండా విరామం:

ప్రతి 20–30 నిమిషాలకు ఒకసారి మొబైల్ చూడటం ఆపి, మెడ మరియు భుజాలను నెమ్మదిగా కదిలిస్తూ స్ట్రెచింగ్ చేయాలి.

స్క్రీన్ టైమ్‌కు పరిమితి:

సోషల్ మీడియా స్క్రోలింగ్‌కు ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. పడుకునే ముందు ఫోన్ దూరంగా ఉంచాలి.

రోజువారీ వ్యాయామం:

నడక, యోగా లేదా సాధారణ వ్యాయామాల ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

మెడ లేదా వెన్నునొప్పి తగ్గకుండా నిరంతరం వేధిస్తున్నా, చేతుల్లో తిమ్మిర్లు రావడం, స్పర్శ కోల్పోయినట్లు అనిపించడం లేదా చేతుల కండరాలు బలహీనపడినట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పైన్ స్పెషలిస్ట్ లేదా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలి. సరైన కూర్చునే భంగిమ , రోజువారీ కదలికలే వెన్నుపూసను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Next Story