Whale Milk: తిమింగలం పాలు ..ప్రపంచంలోనే అత్యంత చిక్కటి పాలు ..ఎందుకో తెలుసా.?
ప్రపంచంలోనే అత్యంత చిక్కటి పాలు ..ఎందుకో తెలుసా.?

Whale Milk: అనంతమైన సముద్రం మరెన్నో వింతలు, విశేషాలకు నిలయం. భూమి మీద అతిపెద్ద జీవి అయిన తిమింగలం గురించి మనకు చాలా విషయాలు తెలుసు. కానీ, మీకు తెలుసా? తిమింగలం తన పిల్లలకు పాలు ఇచ్చే విధానం, ఆ పాల వెనుక ఉన్న ప్రత్యేకత వింటే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం చూసే ఆవు పాలు లేదా గేదె పాలు పల్చగా ద్రవ రూపంలో ఉంటాయి. కానీ తిమింగలం పాలు అలా ఉండవు.
అవును.. తిమింగలం పాలు ఆవు పాలలా పల్చగా ఉండవు. అవి చూడటానికి మనం తినే వెన్న లేదా టూత్ పేస్ట్ మాదిరిగా గట్టిగా, చిక్కగా ఉంటాయి. ఇంత చిక్కగా ఉండటానికి కారణం ఏమిటంటే.. అందులో ఉండే అధిక కొవ్వు శాతం. సాధారణ పాలతో పోలిస్తే, తిమింగలం పాలలో ఏకంగా యాభై శాతం (50%) కొవ్వు ఉంటుంది. అందుకే అవి గడ్డకట్టిన వెన్నలా కనిపిస్తాయి.
ప్రకృతి ఈ పాలను ఇంత చిక్కగా ఎందుకు సృష్టించిందో తెలుసా? ఇక్కడే అసలైన వింత దాగి ఉంది. తిమింగలాలు సముద్రపు నీటి అడుగున నివసిస్తాయి. ఒకవేళ పాలు పల్చగా ఉంటే, తల్లి పాలు ఇవ్వగానే అవి నీటిలో కలిసిపోతాయి. కానీ తిమింగలం పాలు వెన్నలా గట్టిగా ఉండటం వల్ల అవి నీటిలో అస్సలు కరిగిపోవు. దీనివల్ల తిమింగలం పిల్లలు నీటి అడుగున కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పాలు వృథా కాకుండా సులభంగా తాగగలుగుతాయి.
అంతేకాదు ఈ అధిక కొవ్వు వెనుక మరో ముఖ్యమైన కారణం ఉంది. సముద్రం లోపల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. గడ్డకట్టే ఆ చలిని తట్టుకోవడం చిన్న తిమింగలాలకు చాలా కష్టం. ఈ పాలలో ఉండే అధిక కొవ్వు.. పిల్లల శరీరానికి కావాల్సిన అత్యధిక శక్తిని అందించడమే కాకుండా వారి చర్మం కింద ఒక రక్షణ పొరలా ఏర్పడి సముద్రపు చలి నుండి రక్షిస్తుంది. అందుకే కాబోలు, తిమింగలం పిల్లలు రోజుకు వందల లీటర్ల పాలు తాగుతూ చాలా వేగంగా పెరుగుతాయి.

