Sjögren’s Syndrome: జోగ్రెన్ సిండ్రోమ్' అంటే ఏంటి? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!
అలర్ట్ అవ్వండి!

Sjögren’s Syndrome: గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మీ కళ్ళు నిరంతరం పొడిబారినట్లు అనిపిస్తున్నాయా? ఎంత నీళ్లు తాగినా నోరంతా ఎండిపోయినట్లు, జిగటగా మారుతోందా?చాలా మంది దీనికి డీహైడ్రేషన్, ఏసీ రూమ్‌లలో ఉండటం, నిద్రలేమి లేదా వృద్ధాప్యం కారణం అనుకుంటారు. కానీ, అంత ప్రమాదకరం కానివిగా కనిపించే ఈ చిన్న లక్షణాలు.. మీ శరీరంలో పొంచి ఉన్న ఒక ప్రమాదకరమైన 'ఆటో ఇమ్యూన్' వ్యాధికి సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కళ్లు, నోరు తరచుగా పొడిబారడం అనేది 'జోగ్రెన్ సిండ్రోమ్' (Sjogren's Syndrome) అనే ఆటో ఇమ్యూన్ వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ వ్యాధి బారిన పడినప్పుడు.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన కన్నీళ్లు, లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులపైనే దాడి చేస్తుంది. దీనివల్ల కళ్లలో నీరు, నోట్లో లాలాజలం ఊరడం తగ్గిపోయి తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది.
ఈ సమస్య కొన్ని వారాల పాటు కొనసాగి, మీ రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తుంటే.. మీరు ఖచ్చితంగా గమనించాల్సిన ఆ 5 ముఖ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిరంతరం నోరు పొడిబారడం: ఎంత నీరు తాగినా నోరు పొడిగానే ఉండటం.
నమలడం, మింగడంలో ఇబ్బంది: లాలాజలం లేకపోవడం వల్ల అన్నం, రొట్టె, బిస్కెట్లు వంటి పొడి ఆహారాలు మింగడం కష్టంగా మారుతుంది.
తరచూ పంటి సమస్యలు: లాలాజలం తగ్గితే దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన మరియు ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
లాలాజల గ్రంథుల వాపు: దవడ, బుగ్గలు లేదా చెవుల కింద ఉండే గ్రంథులు వాపు రావడం, నొప్పి పుట్టడం జరుగుతుంది.
పొడి కళ్లతో పాటు అలసట, కీళ్ల నొప్పులు: కళ్లలో మంట, ఇసుక పడ్డట్లు అనిపించడంతో పాటు తీవ్రమైన నీరసం, కీళ్ల నొప్పులు రావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.
ఈ లక్షణాలు మీలో ఎక్కువ కాలం కనిపిస్తుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి బ్లడ్ టెస్టులు, కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్సతో లక్షణాలను అదుపు చేయవచ్చు. కాబట్టి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా.. వెంటనే నిపుణులైన డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

