Diabetes Risk: నేటి డిజిటల్ యుగంలో వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (Diabetes) ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ పరిమితి దాటి పెరుగుతున్నా చాలామందికి ఆ విషయం తెలియదు. ఈ వ్యాధి ముప్పును ముందే పసిగట్టడానికి ఉదయం పరగడుపున చేయించుకునే 'ఫాస్టింగ్ బ్లడ్ షుగర్' పరీక్ష ఎంతో కీలకం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి పరగడుపున షుగర్ ఎంత ఉండాలి? పిల్లలు, యువత, వృద్ధులకు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా? ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ దశలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

కనీసం 8 గంటల పాటు ఏమీ తినకుండా, తాగకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగొచ్చు. ఉదయం పూట చేసే రక్తపరీక్షను 'ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్' అంటారు. ఉదయం పరగడుపున రక్తంలో చక్కెర స్థాయిలు 70 నుంచి 99 mg/dL మధ్య ఉంటే దానిని సాధారణ స్థితిగా పరిగణిస్తారు. ఈ విలువలు 100 నుంచి 125 mg/dL మధ్య నమోదైతే అది 'ప్రీ-డయాబెటిస్' దశగా, మధుమేహం వచ్చే ముప్పు పొంచి ఉందనడానికి ముందస్తు హెచ్చరికగా భావించాలి. రక్తంలో చక్కెర స్థాయి 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని డయాబెటిస్ ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఒకసారి 126 దాటినంత మాత్రాన నిర్ధారణకు రాకుండా, వైద్యుల సూచన మేరకు మరోసారి పరీక్ష చేయించుకోవాలి.

ఆరోగ్యవంతులలో సాధారణ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్రమాణాలు కేవలం వయసును బట్టి మారవు. చిన్నపిల్లల్లోనూ సాధారణ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70-99 mg/dL మధ్యే ఉండాలి. పిల్లల్లో తరచూ మూత్రానికి వెళ్లడం, విపరీతమైన దాహం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించాలి. 18 నుంచి 40 ఏళ్ల వయసు వారిలోనూ 70 నుంచి 99 mg/dL సాధారణ స్థాయి. 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే ప్రీ-డయాబెటిస్ దశగా గుర్తించి జీవనశైలి మార్చుకోవాలి.

40 నుంచి 60 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉన్నా, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఉంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయించుకోవాలి. 60 ఏళ్లు దాటిన వారిలో బ్లడ్ షుగర్ నియంత్రణ లక్ష్యాలను వారి ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న ఇతర మందులను బట్టి డాక్టర్లు నిర్ణయిస్తారు. మాటిమాటికీ దాహం వేయడం, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, తిన్న కాసేపటికే మళ్లీ ఆకలి వేయడం, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, నిరంతర అలసట, కంటిచూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

చక్కెర పదార్థాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, వంశపారంపర్య చరిత్ర, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, వ్యాయామం చేయాలి. ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పప్పుధాన్యాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శీతల పానీయాలు, స్వీట్లు, కృత్రిమ చక్కెరలకు దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి, ప్రతిరోజూ కంటినిండా నిద్రపోవాలి. పరగడుపున పరీక్షించిన ప్రతిసారీ బ్లడ్ షుగర్ 126 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా నమోదవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Next Story