WHO Cancer Agency Flags: ఆ మూడు కీలక ఔషధాలపై WHO సంచలన నివేదిక.. క్యాన్సర్ కారకాలుగా గుర్తింపు
క్యాన్సర్ కారకాలుగా గుర్తింపు

WHO Cancer Agency Flags: అధిక రక్తపోటు, తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అవయవ మార్పిడి వంటి దీర్ఘకాలిక సమస్యల చికిత్సలో విస్తృతంగా వాడే మూడు ముఖ్యమైన ఔషధాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. WHO అనుబంధ పరిశోధనా సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, ఈ మూడు మందులను గ్రూప్ 1 క్యాన్సర్ కారకాలు వర్గీకరించింది. అంటే వీటి దీర్ఘకాలిక వాడకం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. భారతీయ శాస్త్రవేత్త జి. బి. జెనాతో సహా 22 మంది సభ్యుల నిపుణుల కమిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
క్యాన్సర్ కారకాలుగా గుర్తించిన ఔషధాల వివరాలు
హైడ్రోక్లోరోథయాజైడ్
ఉపయోగం: అధిక రక్తపోటు నియంత్రణకు మొదటి ప్రాధాన్యతగా వాడతారు.
ప్రమాదం: ఇది అతినీలలోహిత (UV) కిరణాల పట్ల చర్మ సున్నితత్వాన్ని పెంచుతుంది. దీనివల్ల సూర్యరశ్మికి గురైనప్పుడు DNA దెబ్బతిని, స్క్వామస్ సెల్ కార్సినోమా, పెదవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అమెరికా, డెన్మార్క్ అధ్యయనాల్లో తేలింది.
వోరికోనజోల్
ఉపయోగం: ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లను అరికట్టే శక్తివంతమైన యాంటీ-ఫంగల్ డ్రగ్.
ప్రమాదం: శరీరంలో ఈ మందు జీవక్రియ జరిగినప్పుడు విడుదలయ్యే పదార్థాలు కాంతికి ప్రతిస్పందించి చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా కణాల అనియంత్రిత పెరుగుదల జరిగి స్క్వామస్ సెల్ చర్మ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
టాక్రోలిమస్
ఉపయోగం: అవయవ మార్పిడి తర్వాత కొత్త అవయవాన్ని శరీరం తిరస్కరించకుండా రోగనిరోధక శక్తిని నియంత్రించడానికి ఇస్తారు.
ప్రమాదం: ఇది రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా అణిచివేయడం వల్ల, అసాధారణ కణాలను నాశనం చేసే సహజ సామర్థ్యం శరీరం కోల్పోతుంది. దీనివల్ల నాన్-హాడ్కిన్ లింఫోమా, లుకేమియా, అవయవ మార్పిడి అనంతర లింఫోప్రొలిఫరేటివ్ డిజార్డర్, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
భారతదేశానికి ఎందుకు హెచ్చరిక?
భారత్‌లో అధిక రక్తపోటు నియంత్రణకు హైడ్రోక్లోరోథయాజైడ్ విరివిగా వాడుకలో ఉంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం, మోతాదు నియమాలు పాటించకపోవడం వంటి సమస్యలు మన దేశంలో ఎక్కువ. కాబట్టి ఈ నివేదిక నేపథ్యంలో రోగులు వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా మందులు వాడకూడదని, అలాగే ఇప్పటికే వాడుతున్న వారు వైద్యుల సలహా లేకుండా హఠాత్తుగా మందులను ఆపకూడదని నిపుణులు సూచిస్తున్నారు

