People with Diabetes: మధుమేహం ఉన్నవారిలో చిగుళ్ల రక్తస్రావం, పళ్లు ఊడటం ఎందుకు జరుగుతుంది? నిపుణుల హెచ్చరిక..
నిపుణుల హెచ్చరిక..

People with Diabetes: మధుమేహం అనగానే చాలామంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అది గుండె లేదా కిడ్నీలపై ప్రభావం చూపడం గురించే ఆలోచిస్తారు. కానీ డయాబెటిస్ మన నోటి ఆరోగ్యంపై, ముఖ్యంగా పళ్లు, చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ చిగుళ్ల నుండి తరచూ రక్తం కారుతున్నా, లేదా పళ్లు బలహీనపడుతున్నా అది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయనడానికి సంకేతం కావచ్చు.
అసలు కారణం ఏమిటి?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయాబెటిస్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో శరీరం సరిగ్గా పోరాడలేదు.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, అది మన లాలాజలంలో కూడా చేరుతుంది. ఈ గ్లూకోజ్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఆహారంగా మారి, పళ్లపై ప్లేక్ ఏర్పడేలా చేస్తుంది. ఇది చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. శరీరంలో పెరిగే ఈ చక్కెర స్థాయిలు చిగుళ్లలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. ఫలితంగా పళ్లకు పట్టునిచ్చే ఎముకలు బలహీనపడి చిగుళ్ల నుండి రక్తం కారడం లేదా పళ్లు కదిలి ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
డ్రై మౌత్ సమస్య:
డయాబెటిస్ బాధితుల్లో లాలాజలం ఉత్పత్తి తగ్గి నోరు ఎండిపోయే సమస్య సాధారణంగా కనిపిస్తుంది. నోరు పొడిబారినప్పుడు బ్యాక్టీరియా మరింత వేగంగా వ్యాప్తి చెంది, పిప్పి పళ్లు, ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
నివారణోపాయాలు.. నిపుణుల సలహాలు..
ఈ సమస్యల నుండి పళ్లను, చిగుళ్లను కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు..
షుగర్ నియంత్రణ:
అన్నింటికంటే ముఖ్యం రక్తంలో చక్కెర స్థాయిలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవడం.
నోటి పరిశుభ్రత:
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం మరియు ప్రతిరోజూ ఫ్లాసింగ్ %చేయడం అలవాటు చేసుకోవాలి.
హైడ్రేషన్:
నోరు ఎండిపోకుండా ఉండటానికి రోజంతా తగినన్ని నీళ్లు తాగుతుండాలి.
డెంటల్ చెకప్:
ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా దంత వైద్యుడిని కలిసి పరీక్ష చేయించుకోవాలి.
చిగుళ్ల వాపు, నిరంతరం రక్తం కారడం లేదా పళ్లు లూజ్ అవ్వడం వంటి లక్షణాలను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సంకేతాలు కనిపించిన వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.

