Hepatitis B: తల్లవబోతున్న ప్రతి మహిళ జీవితంలోనూ గర్భధారణ అనేది అత్యంత మధురమైన, జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అయితే కేవలం సాధారణ ఆహార నియమాలే కాకుండా, కొన్ని ప్రాణాలను కాపాడే వైద్య పరీక్షలు కూడా ఈ సమయంలో ఎంతో కీలకం. అందులో ముఖ్యమైనదే... హెపటైటిస్-బి స్క్రీనింగ్! అసలు గర్భిణీలు అందరూ ఈ పరీక్ష ఎందుకు చేయించుకోవాలి? దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హెపటైటిస్-బి అనేది కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా, గర్భం దాల్చిన మహిళకు ఈ వైరస్ ఉంటే.. ప్రసవ సమయడంలో లేదా గర్భధారణ దశలో ఆ ఇన్ఫెక్షన్ పుట్టబోయే బిడ్డకు సులభంగా సోకే ప్రమాదం ఉంది. వైద్య పరిభాషలో దీనిని మాతృ-శిశు వైరస్ బదిలీ (Vertical Transmission) అంటారు.

గమనించాల్సిన విషయమేమిటంటే.. పుట్టిన వెంటనే సరైన చికిత్స అందకపోతే, ఈ వైరస్ సోకిన శిశువులలో దాదాపు 90 శాతం మందికి దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (Chronic Hepatitis B) వచ్చే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే క్రానిక్ ఇన్ఫెక్షన్‌ బారిన పడితే భవిష్యత్తులో కాలేయం దెబ్బతినడం లేదా ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అందుకే ప్రతి గర్భిణీ మొదటి త్రైమాసికంలోనే (First Trimester) తప్పనిసరిగా హెపటైటిస్-బి బ్లడ్ టెస్ట్ (HBsAg) చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తల్లికి హెపటైటిస్-బి ఉన్నట్లు ముందే గుర్తిస్తే.. వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే సరైన సమయంలో (మొదటి 12 నుంచి 24 గంటల్లోపు) నవజాత శిశువుకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ , ఇమ్యునోగ్లోబ్యులిన్ (HBIG) అందజేయడం ద్వారా.. బిడ్డకు వైరస్ సోకకుండా దాదాపు 90 శాతానికి పైగా రక్షణ కల్పించవచ్చు.

చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ వైరస్ నిశ్శబ్దంగా శరీరంలో పెరుగుతుంటుంది. అందుకే, "నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు కదా అని నిర్లక్ష్యం చేయకుండా.. ప్రతి కాబోయే తల్లి డాక్టర్ సూచన మేరకు హెపటైటిస్-బి పరీక్షను చేయించుకోవడం ద్వారా తనను తాను రక్షించుకోవడంతో పాటు, తన పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును సురక్షితంగా మార్చవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story