Zinc Deficiency Can Affect Your Health: శరీరంలో జింక్ లోపిస్తే ప్రమాదమే.. సంకేతాలు, తీసుకోవాల్సిన ఆహారాలపై నిపుణుల హెచ్చరిక
నిపుణుల హెచ్చరిక

Zinc Deficiency Can Affect Your Health: సాధారణంగా ఆరోగ్యం విషయంలో చాలామంది విటమిన్ బి12, విటమిన్ డి3 స్థాయిలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు గానీ, శరీరానికి అంతే అవసరమైన ‘జింక్’ అనే ఖనిజాన్ని పూర్తిగా విస్మరిస్తుంటారు. రోగనిరోధక శక్తిని పటిష్ఠంగా ఉంచడంలో, కణాల పెరుగుదలలో, శరీరానికి తగిలిన గాయాలు త్వరగా మానడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మనదేశంలో అత్యధికులు జింక్ ప్రాధాన్యతను గుర్తించకపోవడం వల్ల తెలియకుండానే లోపానికి గురవుతున్నారని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆశిష్ మెహ్రోత్రా స్పష్టం చేశారు.
శరీరంలో జింక్ లోపించినప్పుడు అనేక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి, వీటిని సాధారణ నీరసంగా భావించి తేలిగ్గా తీసుకోకూడదు. రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, గాయాలు ఆలస్యంగా మానడం, తీవ్రంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఆకలి మందగించడం, నాలుకపై రుచి లేదా ముక్కుకు వాసన గ్రహించే సామర్థ్యం తగ్గడం, నిరంతరం నీరసంగా ఉండటం దీని ప్రధాన లక్షణాలు. చిన్నపిల్లల్లో జింక్ లోపం తలెత్తితే అది వారి శారీరక ఎదుగుదల, మానసిక వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఈ లోపాన్ని అధిగమించడానికి రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజలు, నువ్వులు, జీడిపప్పు, బాదం, వేరుశనగలు వంటి డ్రై ఫ్రూట్స్, విత్తనాలలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు శనగలు, అన్ని రకాల పప్పుదినుసులు, తృణధాన్యాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. మాంసాహారులైతే గుడ్లు, చేపలు మరియు లీన్ మీట్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన జింక్ స్థాయిలను సహజంగా భర్తీ చేసుకోవచ్చు.
అయితే కేవలం లక్షణాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సొంత నిర్ణయాలతో జింక్ సప్లిమెంట్లు లేదా మాత్రలు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. శరీరంలో జింక్ మోతాదు పరిమితికి మించి ఎక్కువైతే అది ఇతర ఆరోగ్య సమస్యలకు, విషప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తున్నట్లయితే, ముందుగా వైద్యులను సంప్రదించి రక్త పరీక్షల ద్వారా లోపాన్ని నిర్ధారించుకున్నాకే సలహా మేరకు మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్యమైన మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడమే దీనికి శాశ్వత పరిష్కారం.

