World Yoga Championship: భారతదేశ సాంప్రదాయ వారసత్వం, జీవన వేదం అయిన యోగా.. ఇప్పుడు ప్రపంచ క్రీడా వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి, అంటే జూన్ 4 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'మొదటి వరల్డ్ యోగా చాంపియన్‌షిప్–2026' పోటీలు గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. యోగాను ఒక అంతర్జాతీయ పోటీ క్రీడగా మారుస్తూ, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఈ ఐదు రోజుల మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.

అహ్మదాబాద్‌లోని ప్రముఖ 'ఏకా అరేనా'లో జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో అమెరికా, మలేషియా, శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల నుంచి 400 మందికి పైగా అత్యుత్తమ అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ యోగాసన క్రీడా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన మైలురాయి. మన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ,గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు మద్దతు అందిస్తున్నాయి. ఇక ఆతిథ్య దేశంగా భారత్ తరఫున అత్యధికంగా 122 మంది సభ్యుల బలమైన బృందం ఈ పతకాల వేటలో బరిలోకి దిగుతోంది.

ఈ పోటీల ప్రత్యేకత ఏంటంటే.. 10 ఏళ్ల చిన్నారుల నుంచి 55 ఏళ్ల సీనియర్ల వరకు.. వయసు ఆధారంగా అథ్లెట్లను ఆరు రకాల విభాగాలుగా వర్గీకరించి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. సబ్ జూనియర్, జూనియర్ , సీనియర్ కేటగిరీల్లో పురుషులు, మహిళలు తమ యోగా నైపుణ్యాలను, క్రమశిక్షణను, కళాత్మకతను ప్రపంచానికి చూపించనున్నారు. అంతేకాదు, జడ్జిమెంట్‌లో ఎలాంటి తప్పులు లేకుండా వంద శాతం పారదర్శకత కోసం.. అంతర్జాతీయ యోగా పోటీల చరిత్రలోనే మొదటిసారిగా 'ఎలక్ట్రానిక్ స్కోరింగ్ విధానాన్ని' ఈ చాంపియన్‌షిప్‌లో ప్రవేశపెడుతున్నారు.

క్రీడా ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన కానుక యోగా. ఈ చాంపియన్‌షిప్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు.. ప్రపంచాన్ని ఆరోగ్య మార్గంలో నడిపిస్తూ, యోగాను గ్లోబల్ స్పోర్ట్‌గా నిలబెట్టే ఒక గొప్ప సంకల్పం. మరి ఈ చారిత్రాత్మక మొదటి వరల్డ్ యోగా చాంపియన్‌షిప్‌లో మన భారతీయ అథ్లెట్లు ఎలాంటి అద్భుతాలు చేస్తారో, ఎన్ని పతకాలు సాధిస్తారో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story