Amazing Benefits of Cycling: సైక్లింగ్ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. ఫిట్‌నెస్ కోసం బెస్ట్ వర్కవుట్
ఫిట్‌నెస్ కోసం బెస్ట్ వర్కవుట్

Amazing Benefits of Cycling: మారుతున్న జీవనశైలిలో ఫిట్‌నెస్ సాధించడం కోసం జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం రోజువారీ అలవాట్లలో చిన్న మార్పు చేసుకుంటే చాలు.. అదే సైక్లింగ్! అవును, సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన వ్యాయామం. దీని కోసం మనం ప్రత్యేకంగా కష్టపడాల్సిన పని లేదు. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు.. ఏ వయసు వారైనా ఎంతో ఇష్టంగా, ఎంజాయ్ చేస్తూ సైకిల్ తొక్కవచ్చు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు వంద కోట్ల మంది సైక్లింగ్ చేస్తున్నారని ఒక అంచనా. రోజూ కిరాణా షాప్‌నకు వెళ్లాలన్నా లేదా చిన్న చిన్న దూరాలకు ప్రయాణించాలన్నా.. బైక్‌లు, బస్సులను కాకుండా హాయిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే.. టైంపాస్ అవ్వడంతో పాటు శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సైకిల్ రైడ్‌కు వెళ్తే.. అటు ఫన్, ఇటు హెల్త్ రెండూ మన సొంతమవుతాయి.
మరి సైక్లింగ్ వల్ల కలిగే ప్రధాన ఫిట్‌నెస్ ప్రయోజనాలు
మిగతా ఆటలతో పోలిస్తే సైక్లింగ్ చాలా సులభం. ఇది కండరాలకు ఒక మంచి వర్కవుట్‌లా పనిచేసి, శరీరానికి విపరీతమైన స్టామినాతో పాటు సరైన ఫిట్‌నెస్‌ను అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం చాలా మంచిది. ఇది శరీరంలో కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. అలాగే, రోజూ సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
అంతేకాదు.. కండరాలు బలంగా మారి, వాటికి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కీళ్లు ఎంతో స్మూత్‌గా కదలడానికి, ఎముకలు ధృడంగా మారడానికి సైక్లింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాడీలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించి, బాడీ పోశ్చర్‌ను.. అంటే మనం కూర్చునే, నిలబడే పద్ధతిని ఇది మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా.. బాడీలో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచి.. హార్ట్ ఎటాక్, క్యాన్సర్, డయాబెటిస్, ఒబెసిటీ,ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
ఇక సాధారణ సైక్లింగ్‌తో పాటు 'హ్యాండ్ సైక్లింగ్' కూడా ఒకటి ఉంది. ఇవి రికంబెంట్ ట్రైసైకిల్స్‌లా ఉంటాయి. వీటిలో కాళ్ల కంటే చేతులకే ఎక్కువ పని ఉంటుంది. అవసరమైనప్పుడు వెల్క్రో స్ట్రాప్స్ అనేవి చేతికి పెడల్స్‌లా ఉపయోగపడతాయి. ఎవరికైనా వెన్నెముక గాయాలు (స్పైనల్ ఇంజ్యూరీస్) అయినప్పుడు.. వారు త్వరగా కోలుకోవడానికి ఈ హ్యాండ్ సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల గుండె సంబంధిత ప్రయోజనాలతో పాటు మంచి ఏరోబిక్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

