Donating Blood: రక్తదానం.. ప్రాణదానంతో సమానం. ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి మనం చేసే రక్తదానం, కేవలం అవతలి వ్యక్తికే కాదు.. మన సొంత ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం.

మొదటిగా.. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తంలో ఐరన్ (ఇనుము) స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ పరిమాణం నియంత్రణలోకి వస్తుంది. ఇది గుండెపోటు (Heart Attack), స్ట్రోక్ వంటి ముప్పులను గణనీయంగా తగ్గిస్తుంది.

రెండవది.. కొత్త రక్తకణాల ఉత్పత్తి. మనం రక్తదానం చేసిన వెంటనే, మన శరీరం కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేయడానికి యాక్టివ్‌గా మారుతుంది. ఎముక మజ్జ (Bone Marrow) ప్రేరేపించబడి, వేగంగా కొత్త ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మీ శరీరం సరికొత్త శక్తిని పొందుతుంది.

మూడవది.. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. శరీరంలో ఐరన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

నాల్గవది.. ఉచిత హెల్త్ చెకప్! మీరు రక్తదానం చేయడానికి వెళ్ళిన ప్రతిసారీ.. మీ హిమోగ్లోబిన్, బ్లడ్ ప్రెజర్ (BP), పల్స్ రేట్ , ఇన్ఫెక్షన్లపై ఉచితంగా స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు క్రమం తప్పకుండా తెలిసిపోతుంది.అందుకే, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలు లేకుండా క్రమం తప్పకుండా రక్తదానం చేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story