Mistakes While Taking Medicines: మనం అనారోగ్యం బారిన పడినప్పుడు డాక్టర్లు ఇచ్చే మందులను వాడుతుంటాం. కానీ, ఆ మాత్రలను ఎలా వేసుకుంటున్నామనేది మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది తమకు నచ్చిన పానీయంతోనో లేదా అందుబాటులో ఉన్న నీటితోనో మందులు మింగేస్తుంటారు. అయితే, మందులు వేసుకోవడానికి ఒక పద్ధతి ఉందని, అది పాటించకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మాత్రలను లేదా పొడి రూపంలో ఉండే ఔషధాలను ఎప్పుడూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తీసుకోవడమే అత్యుత్తమం. ఎందుకంటే, చల్లటి నీటితో పోలిస్తే గోరువెచ్చని నీటిలో మాత్రలు త్వరగా కరుగుతాయి. దీనివల్ల ఔషధం రక్తంలోకి వేగంగా చేరుకుని, అనారోగ్యం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అదే చల్లటి నీటితో తీసుకుంటే, ఆ టాబ్లెట్ కరగడానికి ఎక్కువ సమయం పట్టి.. ఉపశమనం ఆలస్యమవుతుంది.

చాలామంది పాలు, జ్యూస్‌లు, కూల్ డ్రింకులు లేదా కాఫీ, టీలతో మందులు వేసుకుంటుంటారు. మరికొందరైతే లిక్కర్‌తో కూడా తీసుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరం! ఇలా చేయడం వల్ల మందులోని రసాయనాలతో ఆ పానీయాలు చర్య జరిపి, ఔషధం యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేస్తాయి. కొన్నిసార్లు ఇవి వికటించి సైడ్ ఎఫెక్ట్స్‌కు కూడా దారితీయవచ్చు. అందుకే, నీరు తప్ప మరే ఇతర పానీయంతోనూ మందులు వేసుకోకూడదు.

ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. టాబ్లెట్‌ను సగం చేయడం, పొడి చేయడం లేదా నీళ్లలో కలిపి మింగడం లాంటివి అస్సలు చేయొద్దు. కొన్ని మాత్రలు శరీరంలోకి వెళ్ళాక నెమ్మదిగా విడుదలవ్వాల్సి ఉంటుంది. మీరు వాటిని పొడి చేస్తే, ఔషధం మొత్తం ఒక్కసారిగా విడుదలవుతుంది. ఇది ఓవర్ డోస్ అయ్యే అవకాశం ఉంది , శరీర అంతర్గత అవయవాలకు ప్రమాదకరంగా మారవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story