Beat Monsoon Diseases: వర్షాకాలంలో వచ్చే రోగాలకు చెక్ పెట్టండి ఇలా!
చెక్ పెట్టండి ఇలా!

Beat Monsoon Diseases: వేసవి కాలం తెచ్చే ఎండల నుంచి ఉపశమనం ఇచ్చే వానకాలం వచ్చేసింది. కానీ.. ఈ వర్షాలతో పాటు రోగాలు కూడా క్యూ కడుతుంటాయి. అవును.. వానకాలం వచ్చిందంటే చాలు.. జ్వరం, జలుబు, దగ్గు, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రులు నిండిపోతుంటాయి.అసలు వానకాలంలోనే ఎందుకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు అంతగా పెరుగుతాయి?ఎందుకంటే.. వర్షాల వల్ల పెరిగే తేమ, వెచ్చని వాతావరణం వైరస్‌లు బతకడానికి, వాటి సంతానోత్పత్తికి బాగా అనుకూలిస్తాయి. దీనివల్ల ఇవి ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తాయి. అలాగే, కలుషిత నీటి వల్ల హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఇ వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.మరి.. ఈ వానకాలంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్య నిపుణులు చెబుతున్న చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మీ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే నిల్వ నీరే దోమలకు నిలయం.
దోమల నివారణ మందులు లేదా దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించండి.
ఎల్లప్పుడూ బాగా మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగండి.
ఈ కాలంలో రోడ్డు పక్కన విక్రయించే ఓపెన్ ఫుడ్‌ను పూర్తిగా అవాయిడ్ చేయండి.
బయట నుంచి రాగానే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. గదుల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోండి. ఒకవేళ జ్వరం, దగ్గు ఉంటే.. ఇంట్లోనే ఉండి బాగా విశ్రాంతి తీసుకోండి.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి.
జ్వరం రెండు రోజులకు పైగా ఉన్నా..
తీవ్రమైన ఒళ్లు నొప్పులు, పదే పదే వాంతులు అవుతున్నా..
శరీరంపై దద్దుర్లు, రక్తస్రావం కావడం లేదా కళ్లు పసుపు రంగులోకి మారినా..
తీవ్రమైన బలహీనత అనిపించినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

