Before and After the Gym: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది రోజూ జిమ్‌కు వెళ్తుంటారు. గంటల తరబడి చెమటోడ్చుతుంటారు. అయితే, కేవలం జిమ్‌లో చేసే వ్యాయామాలు మాత్రమే కాదు.. జిమ్‌కు వెళ్లే ముందు, అలాగే వచ్చాక మనం పాటించే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని, శరీర సౌష్టవాన్ని నిర్ణయిస్తాయి. మరి ఆ ముఖ్యమైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా, జిమ్‌కు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వ్యాయామం ప్రారంభించడానికి కనీసం ఒకటి నుండి రెండు గంటల ముందే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. దీనివల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే, ఖాళీ కడుపుతో బరువులు ఎత్తడం గానీ, కఠినమైన వర్కౌట్లు చేయడం గానీ చేయకూడదు. వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు అరటిపండు, ఓట్స్ లేదా తృణధాన్యాలు వంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

ఇక నేరుగా హెవీ వర్కౌట్లోకి దిగిపోకుండా, కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు వార్మప్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. చిన్నపాటి జాగింగ్, స్ట్రెచింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై కండరాలు వదులవుతాయి. దీనివల్ల గాయాలయ్యే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది.

ఇక జిమ్ ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు లేదా వచ్చాక ఏం చేయాలంటే వర్కౌట్లు అన్నీ అయిపోగానే సడన్‌గా ఆపేయకూడదు. శరీరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు (Cool down) కొద్దిసేపు నెమ్మదిగా నడవడం లేదా కూలింగ్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. దీనివల్ల కండరాల బిగుసుకుపోవడం తగ్గుతుంది.

అలాగే, వ్యాయామ సమయంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి తగినన్ని నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవాలి. వర్కౌట్ పూర్తయిన గంట లోపు ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల కండరాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.అంతేకాకుండా, మీ శరీరం చెప్పే మాటను వినడం చాలా ముఖ్యం. అలసటగా లేదా నొప్పులుగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తేనే జిమ్ ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.

Next Story