Best High-Protein Foods: మనదేశంలో అల్పాహారమైనా, భోజనమైనా బియ్యం, గోధుమలతో చేసిన పదార్థాలనే ఎక్కువగా తింటుంటాం. ఉదయం పూట తినే ఇడ్లీ, దోసె, ఉప్మా లేదా మధ్యాహ్నం తినే అన్నం, చపాతీల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి, ప్రొటీన్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల బియ్యంలో కేవలం 8 గ్రాములు, గోధుమ పిండిలో 9 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే శాకాహారులు తమ శరీరానికి సరిపడా ప్రొటీన్ అందాలంటే ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలపై దృష్టి పెట్టాలి.

"శాకాహారులకు ప్రొటీన్ అందించడంలో పప్పు దినుసులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రతి 100 గ్రాములకు 16 నుంచి 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అందుకే ఉదయం అల్పాహారంలో రెగ్యులర్ ఇడ్లీ, దోసెలకు బదులుగా.. పెసరట్టు, డోక్లా, శనగపిండి దోసె, మినప ఆవిరి కుడుములు వంటివి తీసుకోవడం మంచిది. వడలు, గారెల్లో కూడా ప్రొటీన్ ఉన్నప్పటికీ.. వాటిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. వీటికి ప్రత్యామ్నాయంగా ఉడికించిన శనగలు, పెసలు, అలసందలు, రాజ్మా వంటి గుగ్గిళ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.

"ఇక మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు సోయా గ్రాన్యుల్స్, వెన్న తీసిన పెరుగు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొర్రలు, అండుకొర్రల వంటి చిరుధాన్యాల్లో 100 గ్రాములకు 15 నుంచి 16 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది కాబట్టి, వీటితో వండుకున్న అన్నాన్ని పలుచటి పప్పుతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది. చపాతీలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిలో వేయించిన పుట్నాల పప్పు పొడిని కలుపుకుంటే ప్రొటీన్ శాతం పెరుగుతుంది. అలాగే మూడు వంతుల బియ్యానికి, ఒక వంతు పొట్టు పెసరపప్పు కలిపి కిచిడి లేదా పొంగల్ లాంటివి వండుకోవచ్చు. వీటితో పాటు ఆకుకూరల్లోనూ కొంతవరకు ప్రొటీన్ లభిస్తుంది. కాబట్టి శాకాహారులు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ప్రొటీన్ లోపానికి సులభంగా చెక్ పెట్టవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story