Best Homemade Drink to Boost Energy in Summer: ఎలక్ట్రోలైట్స్.. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట. ముఖ్యంగా ఎండలు ముదిరినప్పుడో, లేదా జిమ్‌లో గట్టిగా వర్కౌట్ చేసినప్పుడో ఈ పదం బాగా వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి ఈ ఎలక్ట్రోలైట్స్? సింపుల్‌గా చెప్పాలంటే.. మన ఒంట్లో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలనే ఎలక్ట్రోలైట్స్ అంటారు. శరీరంలో నీటి శాతాన్ని సమానంగా ఉంచడానికి, కండరాలు సరిగ్గా పనిచేయడానికి, ఆఖరికి మన గుండె సజావుగా కొట్టుకోవడానికి కూడా ఇవి చాలా అవసరం.

మనకు బాగా చెమట పట్టినప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు లేదా నీరసంగా అనిపించినప్పుడు.. మనం కేవలం నీటిని మాత్రమే కోల్పోము. ఆ నీటితో పాటు ఈ కీలకమైన ఖనిజాలను కూడా కోల్పోతాము. అందుకే ఆ సమయంలో కేవలం మంచినీళ్లు తాగితే సరిపోదు... మన శరీరానికి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవసరమవుతాయి. అయితే దీనికోసం మార్కెట్లోకి వెళ్లాల్సిన పనిలేదు. మన వంటగదిలోనే దొరికే ఒక అద్భుతమైన పానీయం అదే.. ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం! ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోగలిగే ఒక సహజసిద్ధమైన ఓఆర్ఎస్ (ORS). ఒక గ్లాసు నీళ్లలో చిటికెడు ఉప్పు, కొద్దిగా చక్కెర, తాజా నిమ్మరసం పిండుకుంటే అమృతం లాంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్ రెడీ అయిపోతుంది.

అయితే ఇందులో చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన సైన్స్ ఉంది! మనం వేసే చక్కెర కేవలం రుచి కోసం మాత్రమే కాదు. మన చిన్న ప్రేగులలో నీరు, సోడియం వంటి పదార్థాలను శరీరం త్వరగా పీల్చుకోవడానికి ఈ చక్కెర ఎంతగానో సహాయపడుతుంది. మన ప్రేగులలో ఉండే ఒక ప్రత్యేక వ్యవస్థ.. ఈ చక్కెర సాయంతోనే నీటిని వేగంగా ఒంటికి పట్టిస్తుంది.

అందుకే ఈ సాదా నిమ్మరసం నీరసాన్ని చిటికెలో తగ్గించేస్తుంది. పైసా ఖర్చు లేదు, నిమిషాల్లో తయారవుతుంది, పైగా తాగడానికి ఎంతో రుచిగా, హాయిగా ఉంటుంది. కాబట్టి ఇకపై నీరసంగా అనిపిస్తే.. కెమికల్స్ ఉండే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ పక్కన పెట్టి.. ఈ నేచురల్ నిమ్మరసం తాగేయండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story