Childhood Lost to Digital Screens: ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు వీధులు, మైదానాలు పిల్లల కేరింతలు, ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ, నేటి ఆధునిక కాలంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి బదులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల వంటి డిజిటల్ స్క్రీన్ల ముందు బందీలుగా మారిపోతున్నారు. ఈ జీవనశైలి మార్పులు సాధారణమైనవిగా అనిపించినప్పటికీ, పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన మరియు నిశ్శబ్దమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సూర్యరశ్మిని దూరం చేస్తున్న డిజిటల్ స్క్రీన్లు..

ఆన్‌లైన్ చదువులు, వినోద యాప్‌లు, వీడియో గేమ్స్ కారణంగా నేటి బాల్యం నాలుగు గోడల మధ్యే పరిమితమైపోయింది. సాంకేతికత ఎన్నో ప్రయోజనాలను అందించినప్పటికీ, పిల్లలను ప్రకృతికి, ముఖ్యంగా సూర్యరశ్మికి దూరం చేస్తోంది. ఏడాది పొడవునా పుష్కలంగా సూర్యరశ్మి లభించే మన దేశంలో సైతం, పిల్లల్లో 'విటమిన్-డి' లోపం అత్యంత వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

విటమిన్-డి లోపం – సంకేతాలు..

సన్‌షైన్ విటమిన్ గా పిలిచే విటమిన్-డి పిల్లల ఎముకల ఎదుగుదలకు, కండరాల బలానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి అత్యంత కీలకం. ఇటీవలి వైద్య పరిశోధనల ప్రకారం, 7 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో ప్రతి వారం సగటున 3 నుండి 4 గురు పిల్లలు ఈ విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, రోజులో కనీసం 30 నిమిషాలు కూడా ఆరుబయట గడపకపోవడం వల్ల పిల్లల్లో తరచూ కండరాల నొప్పులు, విపరీతమైన అలసట, ఊరికే అనారోగ్యానికి గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పిల్లలను ఈ నిశ్శబ్ద ఆరోగ్య ముప్పు నుండి రక్షించడానికి తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు..

ఆరుబయట ఆటలు:

పిల్లలను ప్రతిరోజూ కనీసం 45 నుండి 60 నిమిషాల పాటు బయటకు పంపి ఆడుకునేలా ప్రోత్సహించాలి.

సూర్యరశ్మి సోకేలా చూడటం:

ఉదయం పూట వచ్చే లేత ఎండలో కొద్దిసేపు గడపడం లేదా ఆడుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి సహజంగానే ఉత్పత్తి అవుతుంది.

పోషకాహారం: వారి దైనందిన ఆహారంలో పాలు, పెరుగు, కోడిగుడ్డు సొన, ఆకుకూరలు, రాగులు వంటి కాల్షియం మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

సాంకేతికతకు కాస్త విరామం ఇచ్చి, పిల్లలను ప్రకృతి వైపు మళ్లించడం ద్వారానే వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా మార్చగలమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Next Story