Clay Pot vs Refrigerator: ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతోన్న ఈ వేసవి తాపానికి మన శరీరం కోరుకునేది ఒక్కటే.. కాసిన్ని చల్లని నీళ్లు. డీహైడ్రేషన్ బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నీరు తాగడం చాలా అవసరం. అయితే చల్లని నీటి కోసం చాలామంది ఫ్రిజ్‌పై ఆధారపడితే, మరికొందరు సంప్రదాయ మట్టి కుండను ఎంచుకుంటారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెటర్? ఏది ఆరోగ్యకరం? ఇప్పుడు తెలుసుకుందాం.

పాతకాలం నుండి చల్లని నీటి కోసం వాడుతున్న ఏకైక మార్గం మట్టికుండ. మట్టికుండలో నీరు 'భాష్పీభవన శీతలీకరణ' (Evaporative Cooling) పద్ధతిలో చల్లబడుతుంది. కుండకున్న సూక్ష్మ రంధ్రాల ద్వారా వేడి బయటకు వెళ్లిపోయి, నీటికి సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. ఇది గొంతుకు చాలా మంచిది. ఫ్రిజ్ నీళ్లు తాగితే వచ్చే గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు కుండ నీటితో రావు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రిఫ్రిజిరేటర్ నీటి కంటే మట్కా నీరే మేలు. కుండ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సహజ ఖనిజాలు అలాగే ఉంటాయి. అంతేకాదు, ఈ నీరు శరీర జీవక్రియను (Metabolism) మెరుగుపరుస్తుంది. మట్టిలోని క్షార గుణం (Alkaline nature) శరీరంలోని అసిడిటీని తగ్గించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫ్రిజ్ నీరు తక్షణ ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా, అది శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసే ప్రమాదం ఉంది.

అయితే మట్టికుండ వల్ల పూర్తి ప్రయోజనం పొందాలంటే ఒక చిన్న జాగ్రత్త పాటించాలి. కుండను వారానికి కనీసం ఒక్కసారైనా బ్రష్‌తో శుభ్రం చేయాలి. బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టడం ఉత్తమం. టెక్నాలజీతో వచ్చిన ఫ్రిజ్ నీటి కంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే కుండ నీటితోనే మన ఆరోగ్యానికి భద్రత.

PolitEnt Media

PolitEnt Media

Next Story