Cutting Out Sugar Completely May Be Risky: చక్కెర తినడం పూర్తిగా మానేయండి..!" బరువు తగ్గాలనుకునే వారికైనా, షుగర్ వ్యాధి ఉన్నవారికైనా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, ఫిట్‌నెస్ నిపుణులు ఇచ్చే మొదటి సలహా ఇదే. ఈ క్రమంలో చాలామంది చక్కెరను ముట్టడమే మానేశారు. అయితే.. షుగర్‌ను లైఫ్‌లోంచి పూర్తిగా తొలగించడం అంత మంచిది కాదని ఓ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.

చికాగోలో జరిగిన ‘ఎండోక్రైన్ సొసైటీ’ వార్షికోత్సవ సమావేశం 'ENDO 2026' లో సమర్పించిన ఒక రీసెర్చ్ ప్రకారం.. శరీరానికి బొత్తిగా సుక్రోజ్ అందకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ లేదా గట్ హెల్త్ దెబ్బతింటుందని, తీవ్ర జీర్ణ సమస్యలు వస్తాయని తేలింది. చక్కెర పూర్తిగా మానేస్తే మెటబాలిజంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే కోణంలో ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. అధిక చక్కెర వినియోగం హానికరమే అయినప్పటికీ.. కొన్ని రకాల చక్కెరలను పూర్తిగా దూరం చేయడం వల్ల శరీరంలోని ముఖ్యమైన జీవక్రియలకు అంతరాయం కలగవచ్చని సైంటిస్టులు గుర్తించారు.

ఈ స్టడీ కోసం ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు పరిశీలించారు. ఒక గ్రూప్ ఎలుకలకు 'సుక్రోజ్' ఉన్న లో-ఫ్యాట్ ఫుడ్స్ అందించి.. మరో గ్రూప్‌నకు ఏమాత్రం సుక్రోజ్ లేని లో-ఫ్యాట్ ఫుడ్ ఇచ్చారు. ఆ తర్వాత వాటికి గ్లూకోజ్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి కీలక టెస్టులు చేశారు.

అయితే, ఈ ప్రయోగంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుక్రోజ్ లేని ఫుడ్ తిన్న ఎలుకల బరువులో పెద్దగా మార్పు రాకపోగా.. వాటి మెటబాలిజం దారుణంగా దెబ్బతింది. వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం, ప్రేగుల్లో వాపు రావడం, ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీసే లక్షణాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఆహారం నుండి సుక్రోజ్‌ను పూర్తిగా తొలగించడం వల్ల పేగు ఆరోగ్యం ఊహించని విధంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నిపుణుల ప్రకారం.. ఆహారాలకు జోడించే చక్కెరలు, అలాగే తేనె, సిరప్‌లు, పండ్ల రసాలలో సహజంగా ఉండే 'ఫ్రీ షుగర్స్' ను మన రోజువారీ కేలరీలలో 10 శాతం కంటే తక్కువగా.. వీలైతే 5 శాతం కంటే తక్కువగా తీసుకోవడం ఉత్తమం. అంతేకానీ, కేవలం చక్కెరను పూర్తిగా ముట్టకుండా ఉండటం కంటే.. శరీరానికి అన్ని పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story