‘White Poison’: రుచి కోసం మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఒక ముఖ్యమైన భాగం. ఉప్పు లేకపోతే ఎంతటి రుచికరమైన వంటకమైనా చప్పగా అనిపిస్తుంది. అయితే, ఇదే ఉప్పు మోతాదు మించితే మాత్రం ప్రాణాంతకమైన వైట్ పాయిజన్ గా మారుతుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆధునిక కాలంలో మనం తినే ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్, ఊరగాయలు, చిప్స్, సాస్‌ల ద్వారా మనకు తెలియకుండానే అత్యధిక మొత్తంలో సోడియం శరీరంలోకి చేరుతోంది. దీనికి తోడు వండే కూరల్లో కూడా ఉప్పు ఎక్కువగా వేయడం వల్ల ఈ ఆరోగ్య ప్రమాదాలు రెట్టింపు అవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. శరీరంలో సోడియం స్థాయిలు పరిమితికి మించి పెరిగినప్పుడు, అది రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల బాడీలో ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలుసుకుందాం..

అధిక రక్తపోటు: ఉప్పు పెరిగితే రక్తపోటు అకస్మాత్తుగా పెరిగిపోతుంది.

గుండెపోటు - పక్షవాతం: బీపీ పెరగడం వల్ల గుండె పనితీరు దెబ్బతిని హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

మూత్రపిండాల వైఫల్యం: శరీరంలో ఎక్కువైన సోడియంను వడపోయడానికి కిడ్నీలు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. కాలక్రమేణా కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి.

శరీరంలో ఉప్పు ఎక్కువైందని తెలిపే హెచ్చరిక సంకేతాలు:

మన ఆహారంలో సోడియం శాతం మితిమీరినప్పుడు శరీరం కొన్ని లక్షణాల ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుంది. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు..

చేతులు, పాదాలలో వాపులు:

శరీరంలో నీరు చేరిపోవడం వల్ల వేళ్లు, కాళ్ల పాదాలు లేదా ముఖం వాపునకు గురవుతాయి.

తీవ్రమైన దాహం: శరీరంలోని సోడియం సమతుల్యతను కాపాడటానికి మెదడు పదే పదే నీరు తాగమంటూ తీవ్రమైన దాహాన్ని కలిగిస్తుంది.

తరచుగా తలనొప్పి:

రక్తనాళాలు ఉబ్బడం లేదా ఒత్తిడికి గురవడం వల్ల తరచుగా తలనొప్పి వేధిస్తుంది.

ఉప్పు పదార్థాలపై విపరీతమైన కోరిక:

చిత్రం ఏంటంటే, ఉప్పు ఎక్కువగా తినేకొద్దీ మళ్లీ మళ్లీ ఉప్పగా ఉండే చిప్స్, మిక్చర్ వంటి పదార్థాలనే తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి.

అధిక ఉప్పు తినే అలవాటును తగ్గించుకోవడం ఎలా? నిపుణుల సూచనలు:

మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే వంటింట్లో, డైనింగ్ టేబుల్ పై ఈ చిన్న మార్పులు చేసుకోండి..

రుచి చూడకుండా ఉప్పు వేయకండి:

చాలామంది వడ్డించిన అన్నంలో లేదా టిఫిన్లలో రుచి చూడకుండానే పైన అదనంగా ఉప్పు చల్లుకుంటారు. ఈ అలవాటును వెంటనే మానేయాలి.

డైనింగ్ టేబుల్ పై సాల్ట్ బాక్స్ ఉంచొద్దు:

భోజన బల్లపై నుండి ఉప్పు డబ్బాలను తీసివేయడం వల్ల, అన్నంలో ఉప్పు తక్కువైనా మళ్లీ వేసుకునే అవకాశం తగ్గుతుంది.

ప్రత్యామ్నాయాలను వాడండి:

ఉప్పును తగ్గించి ఆహారంలో రుచిని పెంచడానికి నిమ్మరసం, మిరియాల పొడి, కొద్దిగా అల్లం, కొత్తిమీర లేదా ఇతర సహజ మసాలా దినుసులను ఉపయోగించడం అలవాటు చేసుకోండి.

ప్యాకెట్ ఫుడ్స్ తగ్గించండి..

మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన ఆహారాలు, ఊరగాయలు, ఇన్‌స్టంట్ నూడుల్స్ కొనేటప్పుడు వాటి వెనుక ఉండే న్యూట్రిషన్ లేబుల్ లో సోడియం పరిమాణం ఎంత ఉందో కచ్చితంగా తనిఖీ చేయండి.

ఉప్పును రుచికి సరిపడా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సరిపడా తినడం నేర్చుకోవాలి. ఈ రోజే మీ ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించుకోవడం ద్వారా గుండె, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story