Serious Health Risks: తిన్న వెంటనే పడుకుంటున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక
నిపుణుల హెచ్చరిక

Serious Health Risks: నేటి ఆధునికి జీవనశైలిలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై చూపే శ్రద్ధ, భోజనం తర్వాత పాటించాల్సిన అలవాట్లపై చూపడం లేదు. ముఖ్యంగా రాత్రి భోజనం ముగించిన వెంటనే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత మొదటి 2 నుండి 3 గంటల సమయం జీర్ణక్రియకు అత్యంత కీలకమైనదని, ఈ సమయంలో చేసే తప్పుల వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.
భోజనం తర్వాత అస్సలు చేయకూడని పొరపాట్లు:
వెంటనే నిద్రపోవడం: రాత్రి భోజనం ముగించిన వెంటనే మంచం ఎక్కడం వల్ల కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల గుండెల్లో మంట, గొంతు నొప్పి, తీవ్రమైన అజీర్ణం కలుగుతాయి. కాబట్టి తిన్న తర్వాత కనీసం 2-3 గంటల విరామం ఉన్నాకే పడుకోవాలి.
తీవ్రమైన వ్యాయామాలు: భోజనం చేసిన వెంటనే జిమ్‌కు వెళ్లడం, పరుగెత్తడం లేదా బరువైన వ్యాయామాలు చేయడం వల్ల కడుపు నొప్పి, వికారం కలుగుతాయి. భోజనానికి, వ్యాయామానికి మధ్య కనీసం 1.5 నుండి 2 గంటల సమయం ఉండాలి.
ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం: తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా మారుతుంది. అవసరమైతే కొన్ని గుటకలు మాత్రమే తాగడం ఉత్తమం.
ధూమపానం, మద్యపానం: భోజనం తర్వాత సిగరెట్ లేదా మద్యం సేవించడం వల్ల జీర్ణవ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఇది యాసిడ్ సమస్యలను మరింత పెంచుతుంది.
అతిగా తినడం: ఒకేసారి భారీగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరగడంతో పాటు గ్యాస్ సమస్యలు వస్తాయి. అందుకే చిన్న మోతాదుల్లో, సమతుల్యంగా తినాలి.
రాత్రి భోజనం తర్వాత ఏం చేయాలి?
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని సులభమైన చిట్కాలు:
నెమ్మదిగా నడవడం: భోజనం ముగిశాక 10-15 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోవడం లేదా నెమ్మదిగా నడవడం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
గ్యాడ్జెట్లకు దూరం: తిన్న వెంటనే మొబైల్స్ లేదా ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చోవడం మంచిది కాదు.
పండ్లు, టీ-కాఫీలు: భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు, అలాగే గ్రీన్ టీ లేదా కాఫీ వంటివి తాగాలనుకుంటే కనీసం ఒక గంట విరామం ఇవ్వాలి.
సమయపాలన: ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి తినే అలవాటును చేసుకోవడం వల్ల శరీరం జీర్ణక్రియకు అలవాటు పడుతుంది.
ఆహార నియమం: రాత్రిపూట అధిక నూనె, వేయించిన పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లను పూర్తిగా తగ్గించాలి. మీ రాత్రి భోజనంలో పీచుపదార్థాలు, ప్రోటీన్లు, కూరగాయలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ లక్షణాలు ఉంటే అలక్ష్యం చేయకండి..
మీకు తరచుగా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రైటిస్, వికారం లేదా భోజనం తర్వాత ఆహారం మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే అర్హత కలిగిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను లేదా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతాయని గుర్తుంచుకోండి.

