Lips Keep Cracking: పెదవులు పదే పదే పగులుతున్నాయా? అయితే మీ శరీరంలో ఈ పోషకాల లోపం ఉన్నట్లే..
ఈ పోషకాల లోపం ఉన్నట్లే..

Lips Keep Cracking: చాలా మంది సాధారణంగా చలికాలంలోనో లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడో పెదవులు పగలడం సహజమని భావిస్తారు. పెదవులు ఆరిపోవడం లేదా పగలడాన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు. పెదవులపై వ్యాసెలిన్ లేదా ఏదైనా లిప్ బామ్ రాసి సరిపెట్టుకుంటారు. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా మీ పెదవులు పదే పదే పగులుతున్నా, ఆ సమస్య ఎక్కువ రోజులు వేధిస్తున్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉండవచ్చని ప్రముఖ హెల్త్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
పోషకాల లోపానికి సంకేతమా?
ప్రముఖ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం.. పెదవులు పగలడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో శరీరంలో పోషకాల లోపం కూడా ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా శరీరంలో వవిటమిన్ బి, ఐరన్ లోపం ఉన్నప్పుడు పెదవులు త్వరగా పొడిబారడం, పగలడం లేదా నోటి మూలల్లో పగుళ్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే పెదవులు పగిలిన ప్రతిసారీ అది పోషకాల లోపమే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ ఈ సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే మాత్రం, వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆ రిపోర్టుల ఆధారంగానే అది పోషకాల లోపమా లేక ఇతర ఆరోగ్య సమస్యల వల్ల జరుగుతుందా అనేది తెలుస్తుంది.
పెదవులు పగలడానికి ఇతర సాధారణ కారణాలు..
శరీరంలో నీటి శాతం తగ్గడం
పెదవులను నాలుకతో పదే పదే తడపడం
వాతావరణంలో తీవ్రమైన మార్పులు
తీవ్రమైన ఎండ
కొన్ని రకాల మందుల వాడకం లేదా అలర్జీలు
డైట్‌లో వేటిని చేర్చుకోవాలి?
వైద్య పరీక్షల్లో పోషకాల లోపం ఉన్నట్లు తేలితే, డాక్టర్ల సలహా మేరకు ఐరన్, విటమిన్ బి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.
ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బీన్స్
గుడ్లు, పాలు, పెరుగు
హోల్ గ్రెయిన్స్
చికెన్, చేపలు
దీంతో పాటు శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా తగినంత పరిమాణంలో నీరు తాగాలి. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఎలాంటి విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లను సొంతంగా వాడకూడదు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
పెదవుల పగుళ్ల సమస్య చాలా రోజులుగా తగ్గకుండా ఉన్నా, పెదవుల నుండి రక్తం కారుతున్నా, తీవ్రమైన నొప్పి, వాపు లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇంటి చిట్కాలు లేదా లిప్ బామ్‌లు వాడినప్పటికీ సమస్య తగ్గకపోతే, నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స పొందవచ్చు.

