Exercising at Night Affect Your Sleep: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ఉదయం పూట వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు. దీంతో ఐటీ ఉద్యోగులు, బిజీ షెడ్యూల్ ఉన్నవారు రాత్రి సమయాల్లో, ముఖ్యంగా పడుకోవడానికి కొద్దిసేపటి ముందు జిమ్‌లకు వెళ్లడం లేదా ఇంట్లోనే భారీ కసరత్తులు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇలా అర్ధరాత్రి వేళల్లో వర్కవుట్స్ చేయడం వల్ల రాత్రి నిద్ర చెడిపోతుందా? దీనిపై వైద్య నిపుణుల అభిప్రాయం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపై లేట్ నైట్ వర్కవుట్స్ ప్రభావం ఎంత?

సాధారణంగా మనం వ్యాయామం చేసినప్పుడు శరీరంలో రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. హృదయ స్పందన రేటు పెరగడంతో పాటు, నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అలాగే వ్యాయామం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి శరీర ఉష్ణోగ్రత తగ్గడం, మనస్సు ప్రశాంతంగా మారడం ఎంతో అవసరం. కానీ పడుకోవడానికి సరిగ్గా గంట లేదా అరగంట ముందు హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల శరీరం వెంటనే సాధారణ స్థితికి రాలేకపోతుంది. దీనివల్ల అర్ధరాత్రి వరకు నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కండరాల రికవరీకి ఆటంకం:

భారీ వ్యాయామాల తర్వాత కండరాలు తిరిగి కోలుకోవడానికి శరీరానికి తగినంత విశ్రాంతి, లోతైన నిద్ర అవసరం. లేట్ నైట్ వర్కవుట్ వల్ల నిద్ర సమయం తగ్గితే, కండరాల నొప్పులు పెరగడమే కాకుండా నాడీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణుల సలహాలు.. ఏం చేయాలి?

రాత్రి వేళల్లో వ్యాయామం చేసేవారు నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

సమయం చాలా ముఖ్యం:

మీరు రాత్రి వేళల్లో వ్యాయామం చేయాలనుకుంటే, పడుకోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే దానిని పూర్తి చేయండి. దీనివల్ల మీ గుండె స్పందనలు, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రావడానికి తగిన సమయం దొరుకుతుంది.

భారీ కసరత్తులు వద్దు:

రాత్రి పూట హెవీ వెయిట్ లిఫ్టింగ్, హై-ఇంటెన్సిటీ కార్డియో వంటి కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండటం మంచిది.

తేలికపాటి వ్యాయామాలు ఉత్తమం:

రాత్రి పూట యోగా, స్ట్రెచింగ్, లేదా కాసేపు తేలికగా నడవడం వంటివి చేయడం వల్ల శరీరం రిలాక్స్ అయ్యి, నిద్ర బాగా పడుతుంది.

ఆహార నియమాలు:

వర్కవుట్ తర్వాత హెవీగా డిన్నర్ చేయడం మంచిది కాదు. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story