ఎంత వరకు నిజం

Cause Hair Loss: ఈ రోజుల్లో చాలా మంది యువకులు బాడీని త్వరగా ఫిట్‌గా మార్చాలనే ఉద్దేశంతో జిమ్‌లలో గంటల తరబడి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. సిక్స్ ప్యాక్ బాడీ కోసమో, లేదా బరువు తగ్గడానికో రకరకాల సప్లిమెంట్లు కూడా వాడుతుంటారు. అయితే, ఇలా జిమ్ చేయడం ప్రారంభించిన కొద్దిరోజులకే.. చాలా మందిలో జుట్టు పల్చబడటం లేదా విపరీతంగా జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతుంటాయి. దాంతో "జిమ్ చేయడం వల్లే నా జుట్టు ఊడిపోతోందా?" అనే ఆందోళన వారిలో కలగడం చాలా సహజం.
కానీ ప్రముఖ యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ వైద్యుల ప్రకారం... కేవలం వ్యాయామం చేయడం వల్లే జుట్టు రాలడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. వర్కౌట్స్‌కి, హెయిర్ ఫాల్‌కి అనుకున్నట్లు డైరెక్ట్‌గా ఎలాంటి సంబంధం లేదు. మరి అసలు కారణం ఏంటి? యువత ఎక్కడ తప్పు చేస్తోంది? బాడీని త్వరగా మార్చుకోవాలనే తొందరలో... చాలా మంది క్రాష్ డైటింగ్ పేరిట కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. దీనికి తోడు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు.
ఎప్పుడైతే అధిక శ్రమతో పాటు సరైన పోషకాలు, తగినంత నిద్ర అందవో... అప్పుడు శరీరం తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుంది. వైద్య పరిభాషలో ఈ స్థితిని 'టెలోజెన్ ఎఫ్లూవియమ్' (Telogen Effluvium) అంటారు. ఈ తీవ్రమైన ఒత్తిడి కారణంగానే జుట్టు కుదుళ్లు బలహీనపడి, వెంట్రుకలు విపరీతంగా రాలిపోతుంటాయి.
ముఖ్యంగా బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అయ్యే వారిని లేదా త్వరగా బరువు తగ్గాలనుకునే వారిని చూస్తే... వారు తినే ఆహారాన్ని ఒక్కసారిగా తగ్గిస్తారు, గంటల తరబడి వర్కౌట్స్ చేస్తారు. కానీ బాడీ రెస్ట్ తీసుకోవడానికి మాత్రం అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. పైపైన బరువు తగ్గుతున్నట్లు కనిపించినప్పటికీ, లోపల శరీరం మాత్రం ఈ ఆకస్మిక మార్పులను తట్టుకోలేక షాక్‌కు గురవుతుంది.
దీనికి తోడు కొందరు ఎలాంటి డాక్టర్ సలహా లేకుండా వాడే నాసిరకం ప్రొటీన్ సప్లిమెంట్లు, స్టిరాయిడ్స్ వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జెనెటిక్ హెయిర్ లాస్ (బట్టతల) ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. కాబట్టి జిమ్ చేయండి.. కానీ బాడీకి తగినంత రెస్ట్, ఐరన్, జింక్, ప్రొటీన్లతో కూడిన సమతుల్య ఆహారం అందించడం మర్చిపోకండి.

