Eating Too Much Jaggery: బెల్లం మంచిదే కదా అని అతిగా తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..
అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..

Eating Too Much Jaggery: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే క్రమంలో చాలా మంది వైట్ షుగర్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టి, దానికి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వాడుతున్నారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే "అమృతం ఎక్కువైతే విషం" అన్నట్లు.. చక్కెర కంటే బెల్లం మంచిదే కదా అని అతిగా తీసుకుంటే అది శరీరానికి తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా బెల్లం తినడం వల్ల కలిగే ఆ ముప్పులేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి..
చక్కెర కంటే బెల్లం సురక్షితమైనదే అయినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. బెల్లంలో కూడా అధిక మొత్తంలో సుక్రోజ్ ఉంటుంది. అందువల్ల బెల్లాన్ని అతిగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.
బరువు తగ్గడానికి బదులు.. విపరీతంగా పెరుగుతారు..
చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో టీ, కాఫీల్లో, స్వీట్లలో చక్కెరను పూర్తిగా మానేసి పెద్ద మొత్తంలో బెల్లాన్ని చేరుస్తుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. చక్కెరలో ఉండే క్యాలరీలు దాదాపు బెల్లంలోనూ ఉంటాయి.
క్యాలరీల లెక్క:
100 గ్రాముల బెల్లంలో సుమారు 383 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని ప్రతిరోజూ మోతాదుకు మించి తీసుకుంటే బరువు తగ్గకపోగా.. విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు
బెల్లం శరీరంలో వేడిని కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని ఎక్కువగా తింటే కడుపులో అసౌకర్యం, అజీర్తి, విరేచనాలు వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
కలుషిత బెల్లంతో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం..
మార్కెట్‌లో దొరికే అన్ని రకాల బెల్లాలు పూర్తిగా శుద్ధి చేసినవి కాకపోవచ్చు. సాంప్రదాయ పద్ధతుల్లో సరైన పరిశుభ్రత పాటించకుండా తయారుచేసే బెల్లంలో హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి కలుషిత బెల్లాన్ని నేరుగా తినడం వల్ల పిల్లల్లో మరియు పెద్దల్లో కడుపు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
రోజుకు ఎంత బెల్లం తినాలి?
ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి రోజువారీగా 10 నుండి 15 గ్రాముల బెల్లాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.
కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త:
మార్కెట్‌లో దొరికే తెల్లటి లేదా లేత పసుపు రంగులో ఉండే బెల్లంలో రసాయనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కెమికల్స్ లేని, ముదురు గోధుమ రంగులో ఉండే ఆర్గానిక్ బెల్లాన్ని మాత్రమే ఎంచుకోవాలి..

