Bay Leaves: బిర్యానీ ఆకును కేవలం వంటల్లో సువాసన కోసమే వాడుతుంటాం కదా! కానీ, ఈ ఆకుతో ముఖాన్ని మెరిపించే ఫేస్ సీరమ్, జుట్టును సిల్కీగా మార్చే కండీషనర్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును... బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గించడమే కాకుండా జుట్టు రాలకుండా చేస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ముందుగా... ముఖంపై ముడతలు తగ్గించి, చర్మం పొడిబారకుండా చేసే హోమ్‌మేడ్ ఫేస్ సీరమ్ ఎలా చేయాలో చూద్దాం. కొన్ని బిర్యానీ ఆకులు, అనాస పూలను కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు ఆలివ్ నూనె తీసుకుని, అందులో ఈ పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో నీళ్లు పోసి, ఈ నూనె గిన్నెను అందులో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో పది నిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారాక.. ఒక టేబుల్ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, బాదం నూనె కలిపితే మీ ఫేస్ సీరమ్ రెడీ! ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కుని, నాలుగైదు చుక్కలు రాసి మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఇక జుట్టు విషయానికి వస్తే... ఒక గిన్నెలో కొన్ని బిర్యానీ ఆకులు వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. తలస్నానం చేశాక ఈ నీళ్లను కండీషనర్‌లా ఉపయోగిస్తే జుట్టు ఎంతో మృదువుగా, సిల్కీగా మారుతుంది. అలాగే, బిర్యానీ ఆకును పొడి చేసి, కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే మొండి చుండ్రు సమస్య కూడా చిటికెలో తగ్గిపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story