Frequent Migraines: మైగ్రేన్.. అంటే పార్శ్వనొప్పి. ప్రస్తుతం చాలామంది భారతీయులను, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. తలలో ఒకవైపు వచ్చే విపరీతమైన నొప్పి.. ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మొదలై, మధ్యాహ్నం 12 గంటల వరకు నరకం చూపిస్తుంది. అయితే, ఈ మైగ్రేన్ రావడానికి గల అసలు కారణాలపై జరిగిన తాజా పరిశోధనల్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది!

అదేంటంటే.. మైగ్రేన్‌తో బాధపడే చాలామందిలో రక్తహీనత.. అంటే అనీమియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నవారిలో హిమోగ్లోబిన్ శాతంతో పాటు, శరీరంలో ఐరన్ నిల్వలను తెలిపే ‘ఫెర్రిటిన్’ స్థాయిలు సాధారణ వ్యక్తుల కంటే చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, మైగ్రేన్ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటే.. ఒంట్లో ఐరన్ స్థాయిలు అంత తక్కువగా ఉంటున్నాయట!

మన శరీరంలో ఐరన్ లోపించడం వల్ల మెదడు కణాలకు అందే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల మెదడు కణాల పనితీరు దెబ్బతిని, మైగ్రేన్ లక్షణాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఐరన్ లోపమే మైగ్రేన్‌కు నేరుగా కారణమని ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. కానీ, ఈ రెండింటికీ బలమైన సంబంధం ఉందనేది మాత్రం వాస్తవం.

మీకు తరచూ మైగ్రేన్ నొప్పితో పాటు తీవ్రమైన అలసట, బలహీనత, తల తిరగడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనీమియా (రక్తహీనత) లక్షణాలు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఐరన్ లోపం ఉందని తేలితే, డాక్టర్ సలహా మేరకే మెడిసిన్స్ వాడాలి. సొంత వైద్యంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఐరన్ టాబ్లెట్లు మింగకూడదు. ఎందుకంటే ఒంట్లో ఐరన్ మోతాదు ఎక్కువైనా ప్రమాదమే! సరైన సమతుల ఆహారం, అవసరమైన పరీక్షలు, మరియు డాక్టర్ ఇచ్చే సరైన చికిత్సతో ఈ మైగ్రేన్ సమస్యను, ఐరన్ లోపాన్ని సమర్థంగా నయం చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story